Kalwakurthi | కల్వకుర్తి బీఆరెస్‌లో కుంప‌టి

Kalwakurthi - ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు అసమ్మతి సెగ - ఎమ్మెల్యే తీరు పై మండిపడుతున్న గులాబీ క్యాడర్ - భూ దందాలకు కేరాఫ్ అంటూ ఆరోపణలు - టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న పార్టీ శ్రేణులు! విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కల్వకుర్తి గులాబీ పార్టీలో తీవ్ర అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్‌లకే టికెట్ అని పార్టీ అధినేత ప్రకటించిన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రగిలాయి. ఇదే క్రమంలో […]

  • By: krs    latest    Aug 02, 2023 2:23 PM IST
Kalwakurthi | కల్వకుర్తి బీఆరెస్‌లో కుంప‌టి

Kalwakurthi

– ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు అసమ్మతి సెగ
– ఎమ్మెల్యే తీరు పై మండిపడుతున్న గులాబీ క్యాడర్
– భూ దందాలకు కేరాఫ్ అంటూ ఆరోపణలు
– టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న పార్టీ శ్రేణులు!

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కల్వకుర్తి గులాబీ పార్టీలో తీవ్ర అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్‌లకే టికెట్ అని పార్టీ అధినేత ప్రకటించిన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు రగిలాయి. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కల్వకుర్తి నియోజకవర్గంలో వర్గ పోరు మొదలయింది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదని అంటున్నారు. కసిరెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ సింగ్, మున్సిపల్ చైర్మన్ హెడ్మ సత్యం నిలుస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జైపాల్ యాదవ్ కు టికెట్ ఇవ్వొద్ద‌ని, తమ నాయకుడికే ఇవ్వాలని కసిరెడ్డి వర్గం అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నది.

కసిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే బీసీ నేతలకు ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా భూదందాలకు, భూ సెటిల్మెంట్ లకు పరిమితమైన ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ తనకే ఇవ్వాలని పార్టీ ని కోరుతున్నారు. 2014లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా ఫలితం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాల్సి వచ్చింది. అనంత‌రం సీఎం కేసీఆర్ బీఆరెస్‌లోకి ఆహ్వానించి, ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా బరిలో ఉండాలని అనుకున్నా, అధిష్ఠానం జైపాల్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించిన త‌రువాత‌ జైపాల్ యాదవ్ కసిరెడ్డికి మధ్య దూరం పెరిగిందనే అభిప్రాయాలు స్థానికంగా ఉన్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత కొరవడంతో జైపాల్ యాదవ్ పాల్గొనే కార్యక్రమాలకు కసిరెడ్డి దూరంగా ఉంటూ వచ్చారని అంటున్నారు.

ఈ క్ర‌మంలో కసిరెడ్డి కి మద్దతుగా పలువురు నేతలు నిలువడంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో కసిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశాలకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రాకుండా అడ్డుకుంటూ వచ్చారనే వాదన కూడా ఉన్నది. కార్య‌క‌ర్త‌ల‌ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, భూదందాలు పెరిగిపోయాయని, నియోజకవర్గంలో పర్యటించడం లేదని, అభివృద్ధి పై దృష్టి పెట్టడం లేదని కసిరెడ్డి వర్గం ఆరోపిస్తున్నది.

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కసిరెడ్డి వర్గం మరింత దూకుడు పెంచింది. కసిరెడ్డి కి టికెట్ ఇస్తేనే కల్వకుర్తిలో గులాబీ పార్టీకి మనుగడ ఉంటుందని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, బాలాజీ సింగ్ ఇతర నేతలు అంటున్నారని, కసిరెడ్డికి ఇవ్వని పక్షంలో బీసీలమైన తమరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని, ఈ సారి అత్యధిక మెజారిటీ తో విజయం సాధిస్తానని ధీమా వ్వక్తం చేస్తున్నారు.