సినిమా పేరు: గుర్తుందా శీతాకాలం విడుదల తేదీ: 9 డిసెంబర్, 2022 నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం కథ: కృష్ణ, మాటలు: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: సత్య హెగ్డే, సంగీతం: కాలభైరవ సమర్పణ: ఎం.ఎస్. రెడ్డి, చినబాబు, నిర్మాతలు: రామారావు చింతపల్లి, నాగశేఖర్, భావన రవి దర్శకత్వం: నాగశేఖర్ విధాత: టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ నటులలో ఒకరిగా సత్యదేవ్.. అతి తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం […]
సినిమా పేరు: గుర్తుందా శీతాకాలం
విడుదల తేదీ: 9 డిసెంబర్, 2022
నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్యా శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం
కథ: కృష్ణ, మాటలు: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: సత్య హెగ్డే, సంగీతం: కాలభైరవ
సమర్పణ: ఎం.ఎస్. రెడ్డి, చినబాబు, నిర్మాతలు: రామారావు చింతపల్లి, నాగశేఖర్, భావన రవి
దర్శకత్వం: నాగశేఖర్
విధాత: టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ నటులలో ఒకరిగా సత్యదేవ్.. అతి తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆయన ప్రయాణం సాగుతుంది. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’గా చేసిన చిత్రంలో విలన్‌గానూ నటించి, వెర్సటైల్ యాక్టర్‌గా మరో మెట్టు ఎక్కేశాడు. అలాంటి నటుడు కన్నడలో భారీ విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్ర రీమేక్‌లో చేస్తున్నాడనగానే.. సినిమాపై ఆటోమాటిక్‌గా అంచనాలు పెరిగిపోయాయి.
మిల్క్ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ తమన్నాతో పాటు మరో ఇద్దరు కుర్ర హీరోయిన్లు ఇందులో సత్యదేవ్‌తో జతకట్టడం, విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్.. ఇలా అన్నీ సినిమాపై భారీగా క్రేజ్‌ని పెంచేశాయి. అలాగే ఇయర్ ఎండింగ్ కావడంతో.. రెడీ అయిన చిన్న సినిమాలన్నింటిని ఒకే రోజు అన్నట్లుగా ఈ శుక్రవారం దాదాపు 10కి పైగా సినిమాలు పోటీ పడ్డాయి.
ఆ పోటీలోనూ వెనుకాడకుండా.. ఈ సినిమాను దించారు. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ వాయిదాలు పడుతూ.. నేటికి మోక్షం లభించింది. ముగ్గురు అమ్మాయిలతో సత్యదేవ్ లవ్, అలాగే ప్రమోషన్స్‌లో ఈ చిత్రం మరో ‘గీతాంజలి’ అంటూ యూనిట్ చెబుతుండటం వంటి వన్నీ ఈ సినిమా కోసం వేచి చూసేలా చేశాయి. మరి ఎదురుచూపులకు సరిపడా సక్సెస్‌ని ఈ చిత్రం అందుకుందో, లేదో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
దేవ్ (సత్యదేవ్) మిడిల్ క్లాస్ కుర్రాడు. కాలేజీ డేస్‌లో రిచ్ ఫ్యామిలీకి చెందిన అమృత (కావ్యా శెట్టి) పరిచయం అవుతుంది. కొన్ని మీటింగ్స్ తర్వాత దేవ్‌ని అమృత ప్రేమిస్తుంది. కానీ సత్యదేవ్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తల్లి చెప్పిన మాటలతో.. అతనికి బ్రేకప్ చెప్పేస్తుంది. బ్రేకప్ చెప్పే ముందు.. దేవ్‌ని సూటిపోటి మాటలతో బాగా హర్ట్ చేస్తుంది. తర్వాత తన దారి తను చూసుకుంటుంది.
తర్వాత అతని లైఫ్‌లోకి నిధి(తమన్నా) వస్తుంది. దేవ్ గతం తెలిసి కూడా అతడిని నిధి పెళ్లి చేసుకుంటుంది. నిధితో పెళ్లి తర్వాత అసలేం జరిగింది. మళ్లీ అమృత, దేవ్‌ని ఎందుకు కావాలని అనుకుంటుంది? అసలీ కథంతా దివ్య(మేఘా ఆకాష్) కు.. దేవ్ ఎందుకు చెబుతాడు? దివ్య ఎవరు? చివరికి ఈ ముక్కోణపు ప్రేమకథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
దేవ్‌గా సత్యదేవ్ తన పాత్రకు 100 శాతం న్యాయం చేశాడు. చాలా వేరియేషన్స్ చూపించే అవకాశం సత్యకి ఈ చిత్రంలో లభించింది. ముఖ్యంగా ఇందులో అతడి కామెడీ టైమింగ్ కూడా మెప్పిస్తుంది. సత్యదేవ్, ప్రియదర్శిల మధ్య వచ్చే కొన్ని సీన్లు.. థియేటర్లలో ప్రేక్షకులని హాయిగా నవ్విస్తాయి. అయితే ప్రేమ సన్నివేశాల్లో మాత్రం ఆయన చేయడానికి ఏమీ లేకుండా దర్శకుడు చేసేశాడు. లవ్ సీన్స్‌లో అతను తేలిపోయినట్టు అనిపిస్తుంది. తమన్నా ఇందులో ఛాలెంజింగ్ పాత్ర చేసిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆమె ఇమేజ్, సీనియారిటి.. అంతగా ఆమెని ఎలివేట్ చేయలేకపోయాయి.
ఎందుకంటే, లవ్ సీన్స్‌లో ఫ్రెషర్స్ అయితేనే చూసే వారికి మజా వస్తుంది. కాకపోతే ఆమెకు ఈ సినిమా మంచి ఎక్స్పర్మెంట్గా మిగులుతుందని చెప్పుకోవచ్చు. కాలేజీ డేస్ లవర్‌గా కావ్యా శెట్టికి మంచి పాత్ర పడింది. ఈ వైవిధ్యమైన పాత్రను ఆమె తన నటనతో మెప్పించింది. సత్యదేవ్ చెప్పే కథ వినడానికి తప్ప.. పెద్దగా మేఘా ఆకాష్‌కి ఈ సినిమాలో స్పేస్ లేదు. ఇంకా సుహాసిని, ప్రియదర్శి వంటివారికి కాస్త అవకాశం లభించింది. మిగతా నటీనటులందరూ వారి పాత్రల పరిధిమేర ఈ సినిమాలో అవకాశాన్ని వినియోగించుకున్నారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..
కాలభైరవ ఇచ్చిన సంగీతం, పాటలు.. అలాగే సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అవే ఈ సినిమాకు ప్లస్. నిర్మాణ విలువలు కూడా పరవాలేదు. ఎడిటింగ్ పరంగా చెప్పాలంటే.. సినిమా సాగదీతగానే ఉంది. కొన్ని ఎపిసోడ్స్ అవసరం లేదనిపిస్తుంది. అక్కడక్కడ డైలాగ్స్ బాగా పేలాయి.కథగా చెప్పడానికి తెలుగులో కొత్తగా ఏమీ చేయలేదు. కన్నడ సినిమాని యాజీటీజ్‌గా దింపేశారు.
తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నా కూడా.. ఎందుకో ఆ దిశగా దర్శకుడు నాగశేఖర్ ఆలోచించలేదు. కన్నడలో ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి.. మాతృకను కదిలిస్తే మొదటికే మోసం వస్తుందని భావించి ఉండవచ్చు. దాదాపు ఆ సినిమానే దించేశాడు. నటీనటులు మారారు అంతే తేడా. టెక్నికల్‌గా పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు.
విశ్లేషణ:
తెలుగు ప్రేక్షకులకు ఈ తరహా సినిమాలు కొత్తేం కాదు. కన్నడ, మలయాళ రీమేక్‌లు, డబ్బింగ్ చిత్రాలు టాలీవుడ్లో వర్కవుట్ అవుతున్నాయని.. ఈ చిత్రం చేసినట్లు ఉన్నారు. ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్ వంటి చిత్రాలు కూడా ముక్కోణపు ప్రేమకథలుగానే తెరకెక్కాయి. దాదాపు ఈ చిత్రం కూడా అదే తరహాలో ఉంటుంది. కాకపోతే కొంచెం ‘గీతాంజలి’ టచ్ ఇచ్చారు. ఎందుకు ‘గీతాంజలి’ అనేది ఇక్కడ రివీల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి.. సినిమా చూస్తేనే అది తెలుస్తుంది.
ఆ విషయం పక్కన పెడితే.. ఈ మధ్య ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలియంది కాదు. ఒక ప్రేమకథ చెప్పినా, ఒక గ్యాంగ్‌స్టర్ స్టోరీ చెప్పినా.. అన్నీ అదుర్స్ అనే రేంజ్లో ఉండాలి.. అలాగే అందులో కొత్తదనం ఉండాలి. ఎటువంటి కొత్తదనం లేని సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ముఖ్యంగా ప్రేమకథలంటే.. ప్రేక్షకులు, అందులోనూ యూత్ ఎగబడాలి. వారి హృదయాల్ని దోచేయాలి. అలా అయితేనే ఇప్పుడు వర్కవుట్ అవుతాయి. కన్నడ ప్రేక్షకులకు నచ్చింది కదా.. అని తెలుగు ప్రేక్షకులపై అవుట్ డేటెడ్ లవ్ స్టోరీని రుద్దాలనుకుంటే.. కష్టమే.
ఓటీటీలు వచ్చాక.. ప్రేక్షకులను మెప్పించడం అనేది సాహసంతో కూడుకున్న పని. ఇది దర్శకనిర్మాతలు గమనించాలి. దేవ్ ఫస్ట్ క్రష్.. అదే మొదటి ప్రేమకథ బోరింగ్‌గా అనిపిస్తుంది. అది ఎడిట్ చేసినా సినిమా ఇంకాస్త బాగుండేదని అనిపిస్తుంది. కాలేజీ ప్రేమకథ కాస్త పరవాలేదు. అందులో నవ్వుకోవడానికి కాస్త స్కోప్ ఉంది. నిధి పాత్ర ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ఇంటర్వెల్, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి కానీ.. ఆ తర్వాతే అసలు సాగదీత మొదలవుతుంది.
ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా? అని అనుకోవడం థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల వంతవు తుంది. మొత్తంగా అయితే తెలుగు ప్రేక్షకులను ఈ కథ ఆకర్షించడం కష్టమే. ఎందుకంటే ఈ తరహా సినిమాలు వారు చాలా చూసి ఉన్నారు. ఇంకాస్త కొత్తగా ట్రై చేసి ఉంటే ఏమైనా వర్కవుట్ అయ్యేదేమో. ఫీల్ గుడ్ టచ్ మిస్సయిన సినిమా ఇది. సత్యదేవ్, తమన్నాలను ఇష్టపడే వారు మాత్రం ఒకసారి చూడొచ్చు.. అంతే తప్ప, గుర్తుపెట్టుకోవడానికి పెద్దగా ఏమీ ఇందులో లేదు.
ట్యాగ్‌లైన్: గుర్తు పెట్టుకునేంతగా ఏం లేదు
రేటింగ్: 2/5