కరోనా భయంతో స్వీయ నిర్బంధం.. మూడేండ్ల నుంచి భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య
Coronavirus | 2020లో విజృంభించిన కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కొందరైతే ఆ మహమ్మారి భయానికి ఇంటి గడపను దాడి బయటకు కూడా రాలేదు. ఓ మహిళ కూడా తన కుమారుడితో కలిసి మూడేండ్ల పాటు ఇంటికే పరిమితమైపోయింది. ఈ మూడేండ్ల కాలంలో తన భర్తను కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌కు చెందిన సుజన్.. తన భార్య, కుమారుడితో కలిసి […]

Coronavirus | 2020లో విజృంభించిన కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కొందరైతే ఆ మహమ్మారి భయానికి ఇంటి గడపను దాడి బయటకు కూడా రాలేదు. ఓ మహిళ కూడా తన కుమారుడితో కలిసి మూడేండ్ల పాటు ఇంటికే పరిమితమైపోయింది. ఈ మూడేండ్ల కాలంలో తన భర్తను కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్‌కు చెందిన సుజన్.. తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. అయితే 2020లో తొలిసారిగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించగానే సుజన్ ఉద్యోగానికి వెళ్లాడు. కానీ ఆనాటి నుంచి సుజన్ భార్య మున్‌మున్ స్వీయ నిర్భందాన్ని విధించుకున్నది. 10 ఏండ్ల కుమారుడితో కలిసి ఇంట్లోనే ఒంటరిగా ఉంటోంది. ఈ మూడేండ్ల పాటు భర్తను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. బంధువుల ఇండ్లలో సుజన్ తల దాచుకునేవాడు.
తలుపు తీయాలని సుజన్ ఎన్నిసార్లు కోరినా.. ఆమె పట్టించుకోలేదు. కేవలం వీడియో కాల్స్‌లో మాత్రమే మాట్లాడుకునేవారు. ఇలా దాదాపు మూడేండ్లు గడిచినా సుజన్ భార్య మనసు మారలేదు. దీంతో ఆయన పోలీసులను సంప్రదించాడు. పోలీసులు డోర్‌ను పగులకొట్టి భార్య మున్‌మున్‌ని, ఆమె కుమారుడిని దవాఖానకు తరలించారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.