Harish Rao | రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ భిక్ష
రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని, కేసీఆర్ వల్ల వచ్చిన తెలంగాణలో ఆయనకు నేడు సీఎం పదవి వచ్చిందని మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు అన్నారు

- ముఖ్యమంత్రి భాష అభ్యంతరకరం
- అసలు మార్పు ఇప్పుడే మొదలవుతుంది
- పోరుకు ముందే ఇండియా కూటమి విచ్ఛిన్నం
- కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు
- భద్రాచలం నియోజకవర్గ భేటీలో హరీశ్‌రావు
విధాత : రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని, కేసీఆర్ వల్ల వచ్చిన తెలంగాణలో ఆయనకు నేడు సీఎం పదవి వచ్చిందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన భద్రాచలం నియోజకవర్గం బీఆరెస్ సమావేశంలో మాట్లాడుతూ ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత భాషతో చేసిన విమర్శలు అనాగరికంగా, సంస్కార రహితంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ చెప్పే నీతి మాటలు ముందుగా సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సూచించారు.
రేవంత్ మాటలు రాష్ట్ర పరువును, కాంగ్రెస్ పరువును తీసే విధంగా ఉన్నాయని చెప్పారు. మార్పు తెస్తా అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అభాగ్యులు, అన్నార్తులు, పేదలకు నెల నెలా పింఛన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. గెలిస్తే 4000 రూపాయలు ఇస్తామన్న పింఛన్ ఇవ్వకపోగా పాతవి ఇవ్వలేదన్నారు. ఈ జిల్లా మంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నారని, వాళ్లకు పింఛన్లు ఇవ్వక పోవడమే మీ ప్రాధాన్యమా?, ఇదేనా మార్పు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కరెంటు కోతలు పెట్టడమే మార్పా? 6 లక్షల మంది ఆటో సోదరులను రోడ్డున పడేయడమే మార్పా? రైతు బంధు ఫిబ్రవరి దాకా పడకపోవడం మార్పా?’ అని ప్రశ్నలు గుప్పించారు.
ఇచ్చిన హామీలను, రైతు రుణమాఫీని, ఉద్యోగ నోటిఫికేషన్ల హామీలను పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ లోపు చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు మీకు గుణపాఠం చెబుతారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుండటంతో ప్రజల్లో అసలు మార్పు స్టార్ట్ అయ్యిందన్నారు. నీళ్ళు, పాలు ఏంటో ప్రజలకు అర్థమైందని చెప్పారు. తాము ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి రెచ్చిగొట్టినా తాము రెచ్చిపోబోమని స్పష్టం చేశారు. 420 హామీలు అమలు అయ్యేదాకా తమ పోరాటం ఆగదన్నారు.
కృష్ణా ప్రాజెక్టులతో అప్పగింతతో రాష్ట్రానికి నీటి కొరత
కృష్ణా నది ప్రాంత ప్రాజెక్టులను కేంద్రానికి బీఆరెస్ అప్పగించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ జల హక్కులను కేంద్రానికి అప్పగించి రాష్ట్రాన్ని సాగు, తాగు నీటి సమస్యల పాలుచేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే హామీలు అమలు అవుతాయని రేవంత్‌రెడ్డి అంటున్నారన్న హరీశ్.. 40 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అని మమతా బెనర్జీ అన్నారని గుర్తు చేశారు. నితీశ్, మమత, కేజ్రీవాల్ దూరం అవ్వగా, పోరుకు ముందే ఇండియా కూటమి కుప్పకూలిందన్నారు.
రాహుల్ ప్రధాని అవడం కలేనని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని చెప్పారు. బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. మమత, కేసీఆర్, కేజ్రీవాల్‌కు పోరాడే శక్తి ఉందని చెప్పారు. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కైందని విమర్శించారు. నాడు 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది, భద్రాచలం చుట్టూ జాగను ఆంధ్రాకు అప్పగించింది బీజేపీ, కాంగ్రెస్‌లేనన్నారు. వ్యతిరేకంగా కొట్లాడింది బీఆరెస్ మాత్రమేనని చెప్పారు. లోయర్ సీలేరు ఏపీకి అప్పగించారని, భద్రాచలం రెండు వార్డులు ఆంధ్రలో ఉన్నాయని, నేడు భద్రాచలం కోసం వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్‌కు కూడా జగ లేదని విమర్శించారు.
భద్రాచలం కరకట్ట కోసం 39 కోట్లు బీఆరెస్ ప్రభుత్వం ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. బీఆరెస్ ప్రస్థానంలో పూల బాటలు ఉన్నాయి, ముండ్ల బాటలు ఉన్నాయని, ఓటమి, గెలుపులున్నాయన్నారు. భద్రాచలం ఎమ్మెల్యేను గెలిపించినందుకు ప్రజలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని, మూడోసారి కూడా మహబూబాబాద్ ఎంపీ సీటు గెలవాలని చెప్పారు.