హామీల అమలులో కాంగ్రెస్ దాటవేత
విధాత : మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి నైజమని, ఆరు గార్యంటరీలు, ఎన్నికల హామీలపై కాంగ్రెస్ పాలకులు దాటవేత వైఖరి అనుసరిస్తున్నారని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ పార్లమెంట్ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ జరగలేదని, అప్పులు కట్టాలని రైతులను బ్యాంకర్లు వేధిస్తున్నారని విమర్శించారు. మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని, రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. రూ. 15 వేల రైతుబంధు, రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు రూ. 15 వేలు, నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. 100 రోజుల పాలన చూసి ఓట్లు వేయమని రేవంత్ అడుగుతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కళ్లు తెరిచి రైతు రుణమాఫీ చేస్తదని హరీశ్‌రావు పేర్కొన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు బాధలు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి అవేమీ పట్టించుకోకుండా తాపకోసారి ఢిల్లీకి పోతున్నాడని, రైతులను ఓదార్చేందుకు మాత్రం సమయం దొరడం లేదని విమర్శించారు.
రైతులకు ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీళ్లిస్తలేడుగాని, ప్రతిపక్ష పార్టీ నాయకుల కోసం పార్టీ గేట్లు తెరుస్తాడని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆరోపించారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ గెలుపు గులాబీ జెండాదే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆరెస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని హరీశ్‌రావు సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నచ్చినోళ్లు వారి జేబుల్లో ఉండాలని, నచ్చనోళ్లు జైల్లో ఉండాలని, అందుకే కవితతో పాటు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. లొంగకపోతే ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.