పార్టీ గేట్లు కాదు..ప్రాజెక్టుల గేట్లు తెరవండి: హరీశ్‌రావు

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెరవాల్సింది పార్టీ గేట్లు కాదని, ప్రాజెక్టుల గేట్లు అని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు

  • Publish Date - March 24, 2024 / 10:53 AM IST
  • సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌
  • 100రోజుల పాలనలో 180మంది రైతు ఆత్మహత్యలు
  • హామీలతో మోసం చేసిన కాంగ్రెస్‌
  • దేవరుప్పల్‌లో ఎండిన పంటల పరిశీలన

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెరవాల్సింది పార్టీ గేట్లు కాదని, ప్రాజెక్టుల గేట్లు అని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించిన హరీశ్‌రావు ఎండిన పంటను పరిశీలించారు. రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు విని వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, ఇప్పటికే కాంగ్రెస్ 100రోజుల పాలనలో 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎంకు, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదుగాని, ప్రతిపక్ష నాయకుల ఇండ్లకు వెళ్లడానికి.. మా ఎమ్మెల్యేలను గుంజుకునేందుకు మాత్రం సమయం ఉంటుందని విమర్శించారు. ఎండిన పంటలకు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25 వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100రోజులు దాటిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, రూ.10 వేలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. సాగునీటి కోసం తండ్లాడుతున్న రైతులు కొత్తగా బోర్లు వేసి అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్‌ రెడ్డి సర్కర్‌ విఫలమయిందన్నారు. రైతు బంధు కౌలు రైతులకు కూడా ఇస్తామని వాళ్లను కూడా మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రెండు పంటలు పండాయని, ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు వాపోతున్నారని చెప్పారు. దేవరుప్పుల రైతాంగానికి దేవాదుల ద్వారా పంపింగ్ చేసి నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

 

అవసరమైతే చలో సెక్రటేరియట్‌

సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని.. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లి పంట పొలాలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సాగునీటి కొరత, అకాల వర్షాలకు పోగా మిగిలిన కొద్ది పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదని పేర్కోన్నారు. ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతాంగం కోసం అవసరమైతే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, చలో సెక్రటేరియట్‌కు పిలుపునిస్తామని హరీశ్‌రావు తెలిపారు.