తెలంగాణ శాసనసభ.. హరీశ్‌రావు వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ప్రధాన ప్రతిపక్షం నిప్పులు చెరిగింది.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ప్రధాన ప్రతిపక్షం నిప్పులు చెరిగింది. శ్వేతపత్రం తప్పులతడకగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత బాగా పని చేసిన హరీశ్‌ను కేసీఆర్ సీఎం చేయరు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి దబాయించగానే మైక్ కట్ చేయండం ఏంటి..? మా హక్కులు హరించడం ఏంటి..? అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మీ పార్టీ లాగా రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే ఖర్మ మాకు లేదు. రాజగోపాల్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆయన విత్ డ్రా చేసుకుంటే మేం రెడీ. పీసీసీ పదవిని రూ. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని కోమటిరెడ్డి బ్రదర్సే మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకునేందుకు రెడీగా ఉన్నాను.
నేను కామెంట్ చేయలేదు సభా నాయకుడిపై. వారి వైపు నుంచి ఇష్టారీతిగా కామెంట్ చేసినప్పుడు.. నేను వారు బయట చేసిన మాటలను గుర్తు చేశాను. ఇదేదో నేను సొంత వ్యాఖ్యలు చేయలేదు. మా పార్టీ మీద చేసిన కామెంట్స్‌ను విత్ డ్రా చేసుకుంటే నేను రెడీ. సభా సజావుగా నడవాలన్నదే నా అభిప్రాయం. కొత్త ఆరోపణలు చేయలేదు అని హరీశ్ రావు పేర్కొన్నారు. చివరగా హరీశ్‌రావు వ్యాఖ్యలను మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు.