High Court |
ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే
హైదరాబాద్, విధాత: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా న్యాయవాదుల కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి, న్యాయాధికారుల కోటా నుంచి సుజన కలసికంను అదనపు న్యాయమూర్తులుగా నియమించడంతో సోమవారం తెలంగాణ హైకోర్టులోని ఫస్ట్‌కోర్టులో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే వారితో ఉదయం 9:45 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం 4:30 గంటలకు తెలంగాణ హైకోర్టులోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హైకోర్టులో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధేతోపాటు మిగత న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య..
తెలంగాణ హైకోర్టుకు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా అందులో శాశ్వత న్యాయమూర్తులు 32, అదనపు న్యాయమూర్తుల పోస్టులు 10 ఉన్నాయి. అయితే ప్రస్తుతం 25 మంతి శాశ్వత న్యాయమూర్తులు, ఇద్దరు అదనపు న్యాయమూర్తులు సేవలు అందిస్తున్నారు. శాశ్వత న్యాయమూర్తుల్లో 7, అదనపు న్యాయమూర్తుల్లో 8 పోస్టులు మొత్తం 15 ఉండగా.. పైన పేర్కొన్న ముగ్గురు న్యాయమూర్తుల నియామకంతో ఆ సంఖ్య 12కి తగ్గింది.