High Court |
హైదరాబాద్, విధాత : కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ధర్మాసనం ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే జలగం వెంకట్రావు కూడా అదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కావడం విశేషం.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందగా, బీఆర్ఎస్(టీఆర్ఎస్) నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగిన జలగం వెంకట్రావు ఓటమిపాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో కలిశారు.
అయితే కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు నివేదిక సమర్పించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత సోమవారం జస్టిస్ రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. వనమా వెంకటేశ్వరరావు తన ఆస్తులను చూపించలేదని.. ప్రకటించలేదని నిర్థారిస్తూ.. అతని ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేసింది. ఆయన స్థానంలో జలగం వెంకట్రావును కొనసాగించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. తీర్పుపై అప్పీల్ చేయటానికి.. సుప్రీంకోర్టుకు వెళ్లటానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అంతేకాకుండా తప్పడు అఫిడవిట్ సమర్పించినందుకు వనమాకు న్యాయస్థానం రూ.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయస్థానం సంచాలన తీర్పును ఇచ్చింది.