Himachal | మంచు చినుకులు.. శ్వేత పానుపులు
పర్వతశ్రేణుల ప్రాంతమైన హిమాచల్‌ప్రదేశ్‌లో బుధవారం భారీగా మంచు కుసిరింది. మంచు చినుకులు పడటంతో రాష్ట్రవ్యాప్తంగా శ్వేతపానుపు పరుచుకున్నట్టయింది

- హిమాచల్‌లో భారీగా హిమపాతం
- ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు
- ఈ ఏడాదితో ఇదే తొలి భారీ మంచు
Himachal | విధాత: పర్వతశ్రేణుల ప్రాంతమైన హిమాచల్‌ప్రదేశ్‌లో బుధవారం భారీగా మంచు కుసిరింది. మంచు చినుకులు పడటంతో రాష్ట్రవ్యాప్తంగా శ్వేతపానుపు పరుచుకున్నట్టయింది. పర్యాటకులు మంచుతో ఎంజాయ్ చేస్తున్నారు. కుఫ్రిలోని పర్వత ప్రాంత రిసార్ట్‌లో పర్యాటకులు మంచు తెమ్మెరలతో సేదతీరుతున్నారు. మంచులో గుర్రాలపై షికారు చేసున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా వచ్చిన పర్యాటకులు మంచు వాతావరణానికి సంబురపడుతున్నారు.
“మంచు జోరుగా పడుతున్నది. దానిని చూసేందుకు రెండు కండ్లు చాలడం లేదు. ఇక్కడ ఇంత దట్టంగా మంచుకురవడం 2024లో ఇదే తొలిసారి. ఇది మాకు స్వర్గంగా కనిపిస్తున్నది. ఇంకా మంచు కురుస్తుందనిపిస్తున్నది. ఈ మంచు వాతావరణం చాలా హాయి, అహ్లాదకరంగా ఉన్నది” అని గుజరాత్‌కు చెందిన పర్యాటకుడు శ్రీశ్ తెలిపారు.
భారీగా మంచు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగు జాతీయ రహదారులు సహా రాష్ట్రంలో 130 రహదారులను మూసివేసినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఎత్తయిన పర్వత ప్రాంతాలైన చంబ, కంగ్రా, కల్లు, లాహాల్ స్పిటి, కిన్నోర్, సిమ్లా జిల్లాల్లో బుధవారం దట్టంగా మంచు కురిసినట్టు తెలిపింది.
గడిచిన 24 గంటల్లో కుంకుసేరి ప్రాంతంలో అత్యల్పంగా మైనస్ 2.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కల్ప జిల్లాలోని కిన్నోర్ ప్రాంతంలో మైనస్ 1.2 డిగ్రీలు, సిమ్లాలోని నర్కందలో మైనస్ 1.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు పేర్కొన్నారు.