Hindi Names For Bills | దేశ చట్టాలకు హిందీ పేర్లా?

Hindi Names For Bills | అది రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాలు ముసాయిదా రచనలోనూ లొసుగులు 3 నేర చట్టాల పేర్లు మార్చనున్న కేంద్రం బిల్లులపై పార్లమెంటరీ ప్యానెల్‌లో చర్చ వ్యతిరేకించిన డీఎంకే, బీజేడీ ఎంపీలు? మరింత మెరుగుపర్చాలన్న అధికారులు! న్యూఢిల్లీ: మూడు నేర చట్టాలకు హిందీలో పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. దాని ముసాయిదా రచనలోనూ అసమానతలు, లొసుగులు ఉన్నాయని పేర్కొన్నాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ), […]

  • Publish Date - August 26, 2023 / 12:29 PM IST

Hindi Names For Bills |

  • అది రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షాలు
  • ముసాయిదా రచనలోనూ లొసుగులు
  • 3 నేర చట్టాల పేర్లు మార్చనున్న కేంద్రం
  • బిల్లులపై పార్లమెంటరీ ప్యానెల్‌లో చర్చ
  • వ్యతిరేకించిన డీఎంకే, బీజేడీ ఎంపీలు?
  • మరింత మెరుగుపర్చాలన్న అధికారులు!

న్యూఢిల్లీ: మూడు నేర చట్టాలకు హిందీలో పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. దాని ముసాయిదా రచనలోనూ అసమానతలు, లొసుగులు ఉన్నాయని పేర్కొన్నాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లకు హిందీ పేర్లు పెడుతూ కొత్త బిల్లులను ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో తెచ్చిన విషయం తెలిసిందే. వీటిని హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపారు.

గురువారం నుంచి మూడు రోజులపాటు ప్యానెల్‌ వీటిపై చర్చించింది. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్‌ అధ్యక్షతన సమావేశమైన 28 మంది సభ్యుల ప్యానెల్‌.. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరీక్‌ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్‌-2023లపై చర్చించింది.

అయితే.. బిల్లులకు హిందీ పదాలతో పేర్లు పెట్టడాన్ని బిజు జనతాదళ్‌, డీఎంకే ఎంపీలు సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టే బిల్లులు ఇంగ్లిష్‌లోనే ఉండటాన్ని తప్పనిసరి చేసిన రాజ్యాంగంలోని 348వ ఆర్టికల్‌ను ఇది ఉల్లంఘించడమే అవుతుందని వారు పేర్కొన్నారని తెలిసింది.

‘హిందీలో పేర్లు పెట్టడం ద్వారా వాటి పేర్లపైనే దృష్టిసారించేలా తప్పుదారి పట్టించారు. దీనిపై దక్షిణాది, ప్రాంతీయ పార్టీలకు అభ్యంతరం ఉన్నది. ఆ అభ్యంతరం చట్టబద్ధం కూడా’ అని ఒక ఎంపీ చెప్పారని పార్లమెంటరీ ప్యానెల్‌తో సంబంధం ఉన్న ఒకరు తెలిపారు. అయితే. హిందీలో పేర్లు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదని, ఆ మూడు బిల్లుల టెక్స్ట్‌ ఇంగ్లిష్‌లోనే ఉంటుందని సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా చెబుతున్నారు.

చెత్తగా రాశారు.. లొసుగులు

కొత్త బిల్లులను చెత్తగా రూపొందించారని, అంతేకాకుండా.. అనేక అసమానతలు ఉన్నాయని పలువురు ఎంపీలు అన్నట్టు తెలిసింది. భారతీయ సాక్ష్య (ఎవిడెన్స్‌) బిల్లులో పోలీసు అధికారులకు సంబంధించిన సెక్షన్‌ 23 (2)లో పోలీసుల కస్టడీలో ఉన్న ఏ వ్యక్తి అయినా.. అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటున్నది. అయితే.. మెజిస్ట్రేట్‌ అని అన్నారే కానీ.. జ్యుడిషియల్‌ మెజిస్ట్రేటా లేక ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేటా అన్నది స్పష్టం చేయలేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (1872)లో మెజిస్ట్రేట్‌ అంటే ఎవరో స్పష్టంగా నిర్వచించారని సదరు ఎంపీ చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఇవేకాక అనేక అసమానతలు, లొసుగులు ఉన్నాయని ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. జీవించే హక్కు, సమానత్వం కలిగి ఉండే హక్కులకు విరుద్ధంగా ఉన్నదంటూ ఐపీసీ 303 సెక్షన్‌ (జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి.. ఎవరినైనా హత్య చేస్తే.. మరణ దండన విధింపు)ను మితు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో 1983లో కొట్టేవేసిందని, కానీ, కొత్తగా తీసుకొస్తున్న భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 102లో దీనిని మళ్లీ తీసుకొచ్చారని ప్రతిపక్ష ఎంపీలు ప్రస్తావించారని తెలుస్తున్నది. ఇది మితు తీర్పుకు అసంబద్ధమైనదని చెప్పారని సమాచారం.

మానసిక అనారోగ్యానికీ నిర్దిష్ట నిర్వచనం లేదు

భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 2(19)లో మానసిక అనారోగ్యాన్ని కూడా నిర్దిష్టంగా నిర్వచించలేదని డీఎంకే ఎంపీ ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. కేవలం ‘2017 మానసిక ఆరోగ్యం చట్టంలో పేర్కొన్న అర్థాన్ని కలిగి ఉండాలి’ అని మాత్రమే పేర్కొన్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. కొత్త చట్టంలో దీనితో మరిన్ని సమస్యలు వస్తాయని, మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తి నేరానికి పాల్పడితే.. అది సాధారణ మినహాయింపు కిందికి వచ్చేస్తుందని డీఎంకే ఎంపీ ఎన్‌ఆర్‌ ఇలాంగో అన్నారని సమాచారం. అప్పుడు అదొక నేరంగా పరిగణించకుండా పోయే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారని తెలిసింది. మానసిక అనారోగ్యం అనే అంశాన్ని కొత్త బిల్లులో స్పష్టంగా నిర్వచించాలని ఆయన కోరారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

లేదంటే మద్యం, మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉన్నవారు నేరం చేసినా తప్పించుకునే అవకాశం ఉంటుందని అన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూడు బిల్లులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉన్నదని సమావేశంలో పాల్గొన్న హోం, న్యాయశాఖల అధికారులు పేర్కొన్నారని సమాచారం. అసలు ఈ బిల్లులు తీసుకురావాల్సిన అవసరం ఏమున్నదని కాంగ్రెస్‌ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌, డీఎంకే సభ్యుడు దయానిధి మారన్‌ ప్రశ్నించారని తెలిసింది. ఇప్పటికే కొట్టేసిన సెక్షన్‌లను తిరిగి తీసుకొచ్చేందుకే ఈ బిల్లులను ఉద్దేశించినట్టు కనిపిస్తున్నదని, హత్య కేసులలో ప్రస్తుత చట్టంలోని 302 సెక్షన్‌ బదులు కొత్త చట్టంలో 101 సెక్షన్‌ను చేర్చారని దయానిధి మారన్‌ అన్నారని సమాచారం.

Latest News