Shiva Temple | మహా శివరాత్రి నాడే తెరుచుకునే శివాలయం..! ఈ దేవాలయ చరిత్ర ఏంటో తెలుసా..?

భారతీయ సంస్కృతిలో ఆలయాలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఎన్నో సుప్రసిద్ధ, పురాతన దేవాలయాలతో దేశం శోభిల్లుతున్నది. ఈ ఆలయాలు నలుదిశలా ఆధ్యాత్మికతను ప్రసరింపజేస్తున్నాయి

Shiva Temple | మహా శివరాత్రి నాడే తెరుచుకునే శివాలయం..! ఈ దేవాలయ చరిత్ర ఏంటో తెలుసా..?

Shiva Temple | భారతీయ సంస్కృతిలో ఆలయాలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఎన్నో సుప్రసిద్ధ, పురాతన దేవాలయాలతో దేశం శోభిల్లుతున్నది. ఈ ఆలయాలు నలుదిశలా ఆధ్యాత్మికతను ప్రసరింపజేస్తున్నాయి. దేశంలోని ఒక్కో ఆలయానికి చరిత్ర, ఒక్కో ప్రత్యేకత ఉన్నది. అలాంటి ఆలయం మధ్యప్రదేశ్‌లో ఉన్నది. ఈ ఆలయ ద్వారాలు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటాయి. ఈ ఒక్క రోజు మాత్రమూ ధూప, దీప నైవేద్యాలతో స్వామివారికి పూజలు చేస్తారు. ఇంకా ఈ ఆలయం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి..!

పదో శతాబ్దంలో నిర్మించిన ఆలయం..

ఈ ఆలయం భోపాల్‌కు 48 కిలోమీటర్లకు దూరంలో ఉన్నది. ఈ ఆలయాన్ని సోమేశ్వర ఆలయంగా భక్తులు పిలుస్తారు. దశాబ్దాలుగా ఆలయం కేవలం శివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు. మిగతా రోజుల్లో మూసివేస్తారు. మహాశివరాత్రి రోజున శివుడిని ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు శివాలయాలకు కుటుంబ సమేతంగా భక్తులు తరలివస్తారు. సుమారు 1000 అడుగుల ఎత్తయిన కొండపై ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. 1283వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఆధారలున్నాయి. ఆ తర్వాత మాలిక్‌ కపూర్‌, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్‌ ఈ సోమేశ్వర ఆలయాన్ని ఆక్రమించారు. 1543లో షేర్షా సూరి చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆలయం సోమేశ్వర ఆలయం రాజవంశీయుల ఆధీనంలో ఉండగా.. కేవలం వారి వంశీయులు మినహా సామాన్య ప్రజలకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు.

చారిత్రక నేపథ్యం..

స్వాతంత్ర్యం అనంతరం.. 1974 స‌మయంలో సామాన్య ప్రజల కోసం ఈ ఆలయాన్ని తెరవాలని పెద్ద ఎత్తున‌ ఉద్యమం సాగింది. ఈ క్రమంలో అప్పటి సీఎం ప్రకాశ్‌ సేథీ ఆలయ ద్వారాలు తెరిచి సామాన్యలకు దర్శనం కల్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ పురాతన ఆలయం చారిత్రక నేపథ్యం ఉండడంతో భక్తులకు కేవలం శివరాత్రి మాత్రమే పూజలు నిర్వహించేలా అనుమతి ఇచ్చారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూ వస్తున్నది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పురావస్తుశాఖ నిర్వహిస్తూ వస్తున్నది. శివరాత్రి రోజున 12 గంటల పాటు ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఏడాది ఒకరోజు మాత్రమే ఆలయం తెరిచేందుకు శివభక్తులు ఎదురుచూస్తుంటారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. నారికేలం, పండ్లు తెచ్చి స్వామివారికి నివేదిస్తారు.