విధాత: లవర్స్ డే వస్తోంది.. ఫిబ్రవరి 14న బోలెడు ప్రోగ్రాములతో ప్రేమికులు రెడీ అవుతున్నారు. నెచ్చెలితో కబుర్లు చెప్పుకోవాలని, ముచ్చట్లలో మునిగిపోవాలని.. హగ్గులు పెగ్గులు అంటూ ఏదేదో ప్లాన్స్ వేస్తూనే ఉంటారు.
మరోవైపు భజరంగ్ దళ్ కార్యకర్తలు సైతం తాళి పట్టుకుని పార్కుల్లో తిరుగుతూ ఎక్కడ లవర్స్ కనిపిస్తే వాళ్లకి అక్కడికక్కడే పెళ్లి చేసేద్దాం అనుకుని రెడీగా ఉంటున్నారు. వీళ్ళ ప్రయత్నాల్లో వీళ్ళు ఉండగా కేంద్ర జంతు సంరక్షణా బోర్డు వేరే ప్లాన్ వేసింది. ప్రేమికుల రోజుకు కొత్త అర్థం చెప్పింది.
వాలెంటైన్స్ డేకి ముందు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆ రోజును కౌ హగ్ డే (ఆవుని కౌగిలించుకునే రోజు)గా జరుపుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చింది.
ఆవును కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగాలు సామూహిక ఆనందం లభిస్తాయని చెబుతోంది. కాబట్టి ఈ రోజును కౌ హగ్ డేగా జరుపుకోవాలని ఆవు ప్రేమికులకు యానిమల్ బోర్డు విజ్ఞప్తి చేసింది.
భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోవుకు పెద్ద పాత్ర ఉందని ఆవు స్వభావానికి గోమాత అనే పేరు వచ్చిందని యానియల్ బోర్డు తెలిపింది. ఆవు భారతీయ సంస్కృతికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొంది.