విధాత: ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా తెలంగాణ ఉద్యమం నేత, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ మాజీ ఇంచార్జి చకిలం అనిల్ కుమార్ నియోజకవర్గ ప్రజల్లో..బిఆర్ఎస్ పార్టీలో మళ్లీ పునర్వైభవం సాధించేందుకు వ్యూహాత్మకంగా పురోగమిస్తున్నారు.
నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పోరాటాన్ని ఉవ్వెత్తున నిలిపేందుకు పడిన వ్యయప్రయసాలను గుర్తించి అధినేత, సీఎం కేసీఆర్ నుంచి తగిన పదవి, గుర్తింపు దక్కుతుందన్న 22 ఏళ్ల నిరీక్షణ, ఆశలు అవిరైపోగా నిరాశతో మళ్లీ సొంత పార్టీలోనే గుర్తింపు కోరుతూ అనిల్ ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటాన్ని ఆరంభించారు.
ఇటివలే నల్గొండలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతంగా నిర్వహించిన అనిల్ మండలాల వారిగా ఉద్యమకారులు, బీఆర్ఎస్ అసంతృప్తి వాదులతో వరుస భేటీలతో ఆత్మగౌరవ పోరాటాన్ని ఉదృతం చేసేందుకు ప్రయత్నిస్తు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ దిశగా మరో అడుగు ముందుకేస్తూ ఈ నెల 20న తన తండ్రియైన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే దివంగత సర్ధార్ చకిలం శ్రీనివాసరావు పంతులు శత జయంతి ఉత్సవాలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల ద్వారా నియోజకవర్గంలో తన తండ్రిని అభిమానించే ప్రజలు, అనుచరులను సమీకరించి నియోజకవర్గంలో తిరిగి తమ రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని అనిల్ భావిస్తున్నారు.
అలాగే ఉద్యమ కారులను గుర్తించాలన్న డిమాండ్ దిశగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టిని మళ్లించాలని అనిల్ ఈ శత జయంతి ఉత్సవాల నిర్వాహణ ఆలోచనగా కనిపిస్తుంది. తన తండ్రి సర్దార్ శ్రీనివాసరావు పంతులు పోరాట చరిత్ర స్పూర్తిని ముందుకుతీసుకెళ్లేందుకు, జనంలో పట్టు సాధించేందుకు ఆయన శత జయంతి ఉత్సవాలు ఊతమిస్తాయని అనిల్ ఆశిస్తున్నారు.
ముఖ్యంగా మార్చిలో ఖాళీ కానున్న ఎలిమినేటి కృష్ణా రెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు కేటాయించి గతంలో సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అనిల్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చకిలం అనిల్ కుమార్ చేస్తున్న ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వ్యతిరేకులు, ఆయన వైఖరితో చిన్న చూపుకు గురైనా ఉద్యమ కారులు, పార్టీ వర్గాలు మద్దతుగా నిలుస్తుండటంతో నియోజకవర్గ రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.
అయితే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి తగిన గుర్తింపు, పదవులు లక్ష్యంగా అనిల్ కుమార్ సాగిస్తున్న ఆత్మగౌరవ పోరాటానికి కేసీఆర్ ప్రతిస్పందన ఎలావుండనుందన్నది త్వరలోనే తేలిపోనుంది.