Hyderabad
విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్మారక కేంద్రం వరకు కళాకారులచే భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసే సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులకు వెళ్లే దార్లను మూసేయనున్నారు. వీవీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ, కర్బాల మైదాన్, రాణిగంజ్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదాన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా మళ్లించనున్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపునకు ట్రాఫిక్‌కు అనుమతి లేదు.