భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సుల ప్రస్థానం ఇదీ..
double decker bus | ఎప్పుడో కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు.. భాగ్యనగరం రోడ్లపై మరోసారి మెరవనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత డబుల్ డెక్కర్ బస్సులు నగర రోడ్లపై కనువిందు చేయనున్నాయి. 2006లో చివరి సారిగా నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించాయి. ఆ తర్వాత మళ్లీ ఆ బస్సులు కనిపించలేదు. డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ హైదరాబాద్‌లో దర్శనమిస్తాయా..? అని 2020, నవంబర్‌లో ఓ హైదరాబాదీ చేసిన ట్వీట్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తక్షణమే […]

double decker bus | ఎప్పుడో కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు.. భాగ్యనగరం రోడ్లపై మరోసారి మెరవనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత డబుల్ డెక్కర్ బస్సులు నగర రోడ్లపై కనువిందు చేయనున్నాయి. 2006లో చివరి సారిగా నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించాయి. ఆ తర్వాత మళ్లీ ఆ బస్సులు కనిపించలేదు.
డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ హైదరాబాద్‌లో దర్శనమిస్తాయా..? అని 2020, నవంబర్‌లో ఓ హైదరాబాదీ చేసిన ట్వీట్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి, తప్పకుండా అందుబాటులోకి తీసుకొస్తామని నాడే మాటిచ్చారు. ఆ తర్వాత డబుల్ డెక్కర్ బస్సులపై దృష్టిసారించి, ఎట్టకేలకు మూడేండ్ల తర్వాత నగర వాసుల కల నెరవేర్చారు. కొత్తగా డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రావడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజాం హయాంలోనే డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్ స్టేట్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని 1932లో నిజాం రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే 1942లో హైదరాబాద్‌లో ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ లక్ష్యం.. స్టీల్, ఇతర ఫర్నిచర్‌ను ఉత్పత్తి చేయడం. బస్సులను కూడా ఆల్విన్ కంపెనీ తయారు చేసేది. తొలిసారిగా 1964లో లండన్‌కు చెందిన పార్క్ రాయల్ వెహికల్స్ లిమిటెడ్, ప్రెస్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ కలిసి డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేసి, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
1972లో తొలిసారిగా పరుగులు పెట్టిన డబుల్ డెక్కర్ బస్సులు..
భాగ్యనగరంలో తొలిసారిగా 1972లో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టాయి. నాటి నుంచి 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఆ బస్సులు కనుమరుగు అయ్యాయి. భాగ్యనగరంతో ఆ బస్సులకు మూడున్నర దశాబ్దాల పాటు బంధం కొనసాగింది.
డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి
హైదరాబాద్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపేవారు. ఒక్కసారైనా అందులో ప్రయాణించాలని ఆశించేవారు. అప్పట్లో 7, 5 నంబర్ రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. నగర రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులో వెళ్తుంటే అంబారీపై వెళ్తున్నట్లు అనిపించేందని చాలామంది ఇప్పటికీ చెప్తుంటారు. అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్, పశ్చిమబెంగాల్‌లో మినహా దేశంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం.
హైదరాబాదీ ట్వీట్‌తో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులపై చర్చ
2020, నవంబర్ 07వ తేదీన షాకిర్ హుస్సేన్ అనే నెటిజన్ డబుల్ డెక్కర్ బస్సులపై కేటీఆర్, తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు జూ పార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్ గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవంటూ..ఓ ఫొటో జత చేశారు. మళ్లీ ప్రయాణికులు, టూరిస్టుల కోసం డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? అని నెటిజన్ అడిగాడు.
తక్షణమే స్పందించిన కేటీఆర్..
షాకిర్ హుస్సేన్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించారు. తన చిన్నతనాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అబిడ్స్‌లో మా స్కూల్ ముందు నుంచే డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి అని నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు కేటీఆర్. ‘అప్పట్లో డబుల్ డెక్కర్లను ఎందుకు ఉపసంహరించుకున్నారో నాకు తెలియదు, వాటిని మళ్లీ నడిపే అవకాశం ఉందా’ అని ప్రశ్నిస్తూ దాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన ఆయన, వెంటనే ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడి, ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు.
మూడేండ్ల తర్వాత నెరవేరిన కల..
అలా మూడేండ్ల తర్వాత డబుల్ డెక్కర్ బస్సుల కల నెరవేరింది. హైదరాబాదీ ట్వీట్‌తో కేటీఆర్ తక్షణమే స్పందించడం. రవాణా శాఖ మంత్రికి ట్యాగ్ చేయడం.. ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలవడం.. అలా అన్ని పనులు చకచకా అయిపోయాయి. మొత్తానికి నగర ప్రజలకు మరోసారి డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే భాగ్యం కలిగింది.
I have many fond memories of riding the double decker bus on my way to St. George’s Grammar School at Abids