విధాత: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేది తానేనని టిపిసిసి ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి ప్రకటించుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కృష్ణా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేయడం, విజయం సాధించడం తద్యమన్నారు.
గత ఉప ఎన్నికల్లో మునుగోడు టికెట్టు తనకే వచ్చినా చివరి నిమిషంలో పాల్వాయి స్రవంతికి ఇచ్చారని తెలిపారు. అప్పుడే టికెట్ తనకి ఇచ్చి ఉంటే బిజెపికి అన్ని ఓట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు. ఆ ఎన్నికల్లో తాను నిస్వార్ధంగా కష్టపడి పని చేసినట్లు వివరించారు. ఉప ఎన్నికలప్పుడే వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ, పీసీసీ నాయకులు నాకు చెప్పారన్నారు.
ఆ మాట ప్రకారమే తనకు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు. అందుకే తన సొంత గ్రామం సర్వేల్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు ప్రారంభించినట్లు ప్రకటించారు. నేటి నుంచి కార్యకర్తలను సమీకరించి చైతన్య పరుస్తానన్నారు. కార్యకర్తలంతా ధైర్యంగా, నిజాయితీగా, నిస్వార్ధంగా పనిచేసి కాంగ్రెస్ గెలుపులో భాగస్వాములు కావాలన్నారు. అందరూ కష్టపడి పని చేస్తే కాంగ్రెస్ కు మునుగోడులో ఎదురులేదన్నారు.
ఈ సంవత్సరం జూన్ నెల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఎప్పుడైనా వెళ్లే అవకాశం ఉందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల తీరు చూస్తే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇప్పటినుంచే చైతన్య పరుస్తూ కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నట్లు కృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రతి మండలాన్ని నెలలో రెండు మూడు పర్యాయాలు పర్యటించి సమావేశాలు నిర్వహిస్తానన్నారు.
మోడీ, కేసిఆర్ లు ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నట్లు ఆరోపణలు చేసుకుంటారని, లోలోపల మాత్రం ఇద్దరు ఒకటే అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ఘర్ వాపస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. కొందరి చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర పార్టీలకు వెళ్లారన్నారు. వారంతా ఆయా పార్టీలలో ఇమడ లేక కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. త్వరలోనే వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లుగా కృష్ణారెడ్డి ప్రకటించారు.
కాంగ్రెసులో కొందరు నాయకులు పార్టీ కార్యకర్తల మధ్యన మనస్పర్ధలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని కృష్ణారెడ్డి తెలిపారు. నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తల కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తలు అందరికీ న్యాయం జరుగుతుందని కృష్ణారెడ్డి సూచించారు.
గ్రామా మండల కమిటీలను వేసే సమయంలో కార్యకర్తల అభిప్రాయం మేరకే కమిటీలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఒకరిద్దరు నాయకులు అపోహలు సృష్టించి కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలు రగిలిస్తున్నారన్నారు. కార్యకర్తలు నిజాయితీగా ఆలోచించి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిజాయితీగా పనిచేసే కాంగ్రెస్ను గెలిపించుకుంటే అందరికీ భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
బిజెపి ,బీఆర్ఎస్ లు ఒక్కటే..
దేశంలో బిజెపి ,రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకే తాను ముక్కలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులని దోపిడీ చేసి సంపన్నులకు పెడుతున్నాడని ఆరోపించారు. ప్రధాని మోడీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై పెను భారం మోపాడన్నారు. కేవలం ఆదాని, అంబానీ, కార్పొరేటు సంస్థలకు లాభం చేకూర్చడమే మోడీ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం పెన్షన్లు, రైతులకు పెట్టుబడి డబ్బులు చెల్లించి అంత బాగున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగానే రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 15000 చొప్పున డబ్బు చెల్లించనున్నట్లు తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యం అన్నారు.
పత్తి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు లిక్కర్ స్కాములు, లీకేజీల స్కామ్ లతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
ఈ సమావేశంలో సంస్థాన్ నారాయణపురం ,చౌటుప్పల్, మునుగోడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపూరి సతీష్, బోయ దేవేందర్, సుర్వి నరసింహ, చౌటుప్పల్ పట్టణ శాఖ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, సర్వేల్ గ్రామ శాఖ అధ్యక్షుడు పగిళ్ళ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు ఎండి అక్బర్ అలీ, గాదరి శంకరయ్య, నారాయణపూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు జెక్కిడి చంద్రారెడ్డి, సర్వేల్ ఉప సర్పంచ్ బాలగోని చిన్న భక్తులు, చిలువేరు నరసింహ , మీనుగు గోపాల్, జింకల మారయ్య, పందుల స్వామి గౌడ్, పగిళ్ల బిక్షపతి, చిలువేరు గాలయ్య, జక్కలి శ్రీశైలం, వనమోని వెంకటేష తదితరులు పాల్గొన్నారు