మునుగోడును దత్తత తీసుకుంటా.. 3 నెలలకో సారి వస్తా: కేటీఆర్
విధాత: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సిరిసిల్ల మాదిరిగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనది అని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి, తాను ప్రతి మూడు నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్. నవంబర్ 6 తర్వాత ప్రతి మూడు నెలలకొకసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తాను. అభివృద్ధిలో […]

విధాత: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సిరిసిల్ల మాదిరిగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనది అని చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డి, తాను ప్రతి మూడు నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.
నవంబర్ 6 తర్వాత ప్రతి మూడు నెలలకొకసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తాను. అభివృద్ధిలో అండగా ఉంటాను. రోడ్లను అభివృద్ధి చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచండి. తప్పకుండా అభివృద్ధిలో పయనిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేద్దామన్నారు. కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసన్నారు.
2006లో 32 మండలాలు తిరుగుతూ.. ఆయన స్వయంగా పాట రాశారు. చూడు చూడు నల్లగొండ.. గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని పాట రాసిండు. శివన్నగూడెంలో నిద్రించి నాడు ఒక మాట ఇచ్చారు. తాగునీటి మంత్రి జానారెడ్డి, సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయిండు. ఏ ఒక్కరూ కూడా మంచి చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, మీ ససమస్యను పరిష్కరిస్తామని చెప్పి, ఇచ్చిన హామీని నెరవేర్చారు.
నల్లగొండ జిల్లాకు అనుకొని కృష్ణా నది వెళ్తున్నప్పటికీ, తాగు, సాగునీటి సమస్య పరిష్కరించలేదు. రిజర్వాయర్లు కట్టలేదు. తాగునీరు ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో చెర్లగూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ కట్టి రెండున్నర లక్షలకు నీరు ఇవ్వబోతున్నాం. లక్ష్మణపల్లి రిజర్వాయర్ చేపట్టాం. చెరువులను నింపుతున్నాం.
లక్షా 13 వేల మందికి రైతుబంధు సాయం అందుతుంది. 10 ఏండ్లకు ముందు మునుగోడు ఎలా ఉండే..? ఇప్పుడు మునుగోడు ఎలా ఉందో? ఆలోచించాలి. ఒకప్పుడు రాత్రి సమయాల్లో బావుల వద్దకు వెళ్లి మోటార్లు వేసుకునే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఉమ్మడి ఏపీలో విత్తనాలు పోలీసు స్టేషన్‌లో పెట్టి ఇచ్చేవారు. అవి కూడా కల్తీ విత్తనాలే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా అమలు చేస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. వారం రోజుల్లో రూ. 5 లక్షలు ఇస్తున్నాం.
తాగు, సాగునీటితో పాటు కరెంట్ సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రధానులు పట్టించుకోని సమస్యను కేసీఆర్ పరిష్కరించారు. 1996లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 400 మంది నామినేషన్లు వేసి దేశ దృష్టిని ఆకర్షించారు. కానీ పరిష్కారం దొరకలేదు. కేసీఆర్ వచ్చాక ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత విముక్తి కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్
మునుగోడు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కోమటిరెడ్డి తీరును ఎండగట్టారు. కాంట్రాక్టుల కోసమే రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. చండూరులో నిర్వహించిన టీఆర్ఎస్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ నాలుగేండ్ల పాటు పట్టించుకోని నియోజకవర్గాన్ని, ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తడంట అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను కోమటిరెడ్డి తుంగలో తొక్కారు. ఈ నాలుగేండ్లలో ఒక్క మంచి పని చేయలేదు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించలేదు. చేసిందేమీ లేదు. అసెంబ్లీలో మైక్ దొరికితే.. కాంట్రాక్టర్‌లకు బిల్లుల వస్తలేవు అని అంటడు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొట్టాను అంటున్నాడు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని కేటీఆర్ అన్నారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ మాకు మోదీ ఇచ్చిండని ఆయనే చెబుతాడు. మళ్లీ మాది చిన్న కంపెనీ అని అంటడు. మరి చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన వారెవరు? దాని వెనుక ఉన్నది ఎవరు? మునుగోడుకు అవసరం లేని ఎన్నిక ఇది.
బలవంతంగా మీ మీద రుద్దబడుతున్న ఎన్నిక ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలంటే మోదీ ఇవ్వరు. కానీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులను అప్పనంగా రాజగోపాల్ రెడ్డికి కట్టబెట్టారు. ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. నాలుగేండ్ల పాటు మునుగోడును పట్టించుకోలేదు.
నేను పక్కా లోకల్.. మునుగోడు సేవకుడిగా ఉంటా: కూసుకుంట్ల
నేను పక్కా లోకల్.. మునుగోడు సేవకుడిగా ఉంటానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని ఆయన గుర్తు చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను పక్కా లోకల్.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్ లోకల్ అని పేర్కొన్నారు. వారికి నియోజకవర్గం పై పెద్ద అవగాహన లేదు. నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను కేసీఆర్ సహకారంతో పూర్తి చేస్తాను. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా పని చేసి నిలుస్తాను. ఈ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని కూసుకుంట్ల తేల్చిచెప్పారు.
తాను లోకల్ వ్యక్తిని కాబట్టే.. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్లకు అమ్ముడు పోయాడని ప్రజలే చెబుతున్నారని, తన సొంత ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తీసుకొచ్చిన రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇవాళ తాను నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మద్దతు తెలిపారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్‌ను గెలిపించుకుంటామని ప్రజలు తీర్మానాలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.