విధాత: మొత్తానికి పోసాని కృష్ణమురళి అలా డిసైడ్ అయ్యాడు. టిక్కెట్ ఇచ్చినా గెలవనని అర్థం చేసుకున్నాడు. జగన్పై అపారమైన అభిమానం చూపే ఈ రచయిత కమ్ నటుడు ఈమధ్య ఏపీ టెలివిజన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమితులై ఈమధ్యనే బాధ్యతలూ తీసుకున్నారు. ఆ తరువాత ఆయన ఒక ఛానెల్‌తో మాట్లాడారు.
తనకు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీటు ఇచ్చినా ఓడిపోతానన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడుస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని కొనియాడారు. ఇన్ని చేస్తున్న జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ తనకు సీటు ఇచ్చినా ఓడిపోతానని తేల్చేశారు. తనకు రాజకీయాలు సరిపడవని అన్నారు. పోసాని 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత నుంచి జగన్ అనుకూల స్టాండ్ తీసుకుని టీవీ ఛానెళ్ల డిబేట్లలో జగన్‌కు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు.
ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడే వారు. తనకు ఏదైనా పదవి ఇస్తానని జగన్ మోహన్ రెడ్డి చాలాసార్లు కబురు పెట్టినా తాను వద్దన్నానని గతంలో చెప్పిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు మాత్రం పదవి తీసుకున్నారు. మొన్ననే బాధ్యతలూ చేపట్టారు