పాలమూరు ఆడబిడ్డను ఆశీర్వదించండి..బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

పాలమూరు ఆడబిడ్డగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచానని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం తనపై ఎప్పటిలాగే ఉండాలని, పాలమూరు అభివృద్ధి కోరుకునే

  • Publish Date - March 14, 2024 / 02:11 PM IST

పార్లమెంటులో పాలమూరు గళం వినిపిస్తా

ప్రస్తుతం దేశంలో మోదీ హవా నడుస్తోంది

దేశానికి, ప్రజలకు మోదీ రక్షణ అవసరం

బీజేపీ ఉన్నంత కాలం ప్రజలు ధైర్యంతో ఉంటారు

పాలమూరు లోక్‌సభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు ఆడబిడ్డగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచానని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం తనపై ఎప్పటిలాగే ఉండాలని, పాలమూరు అభివృద్ధి కోరుకునే నాయకురాలినని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తనపై ఉన్న నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానంలో స్వల్ప మెజారిటీతో ఓటమి చెందానని, ప్రస్తుత ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం ఉందని అరుణ చెప్పారు.

నాడైనా నేడైనా నాకే ఆదరణ

అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల్లో తనకు ఆదరణ ఉందని డీకే అరుణ చెప్పారు. గత ఎన్నికల్లో బీఆరెస్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తాను మూడు లక్షలకు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచానని గుర్తు చేశారు.

మరోసారి మోదీ మానియా

దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోసారి ప్రధాని మోదీ మానియా మొదలైందని డీకే అరుణ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే 12 స్థానాలు, పాలమూరు అభివృద్ధి జరగాలంటే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాలు గెలవాలన్నారు. మహబూబ్ నగర్ స్థానాన్ని గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లా అభివృద్ధిలో తన వంతు కృషి ఎంతో ఉందని, ఈ విషయం ఇక్కడి ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ ప్రాంత బిడ్డగా తనను నమ్మి గెలిపించాలని కోరారు. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానన్నారు.

అభ్యర్థులే దొరకని బీఆరెస్‌

గతంలో అధికారంలో ఉన్న బీఆరెస్‌కు ఇప్పుడు అభ్యర్థులే దొరకని పరిస్థితి వచ్చిందని, గతంలో ఇక్కడి నుంచి గెలిచినోళ్లు గెలిచినా ఇక్కడ లేరని, కానీ తాను గెలిచినా ఓడినా పాలమూరు ప్రజలతోనే ఉన్నాన్నారు.

ప్రజలు ఇప్పుడు వేయబోయే ఓటు ప్రధానిని నిర్ణయించేదని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆమె కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందన్నారు. మహిళలకు రు.2500 హామీ ఇవ్వలేదు, రైతు బంధు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రుణ మాఫీ చేయలేదన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ హామీల అమలు పేరుతో మీడియాలో ప్రమోషన్ చేసుకుంటోందని అరుణ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి చూపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదని, ప్రస్తుతం ఆ పార్టీ దీనావస్థలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, నాయకులు పడకుల బాలరాజు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి, సత్యం, క్రిస్టియ నాయక్, పవన్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మిథున్ రెడ్డి, అంజయ్య, జయశ్రీ, పద్మ వేణి, లక్ష్మీదేవి, లక్ష్మి, సాహితి రెడ్డి ,కిరణ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, రాజేందర్ రెడ్డి ,గోవింద్ నాయక్ ,నారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.