న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్రధానంగా ఇండియా కూటమి – ఎన్డీఏ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఎన్డీఏను ఓడించి, ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకోవాలనే సంకల్పంతో ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు వెల్లడి అయ్యాయి. రాష్ట్రాల వారీగా ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుందనే వివరాలను వెల్లడించింది ఇండియా టుడే.
తెలంగాణలో తొలిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫర్‌ఫర్మేన్స్ ఇవ్వనున్నట్లు సర్వేలో వెల్లడైంది. 17 స్థానాలకు గానూ పక్కా 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవనున్నట్లు తెలిపింది. ఎన్డీఏ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బీఆర్ఎస్ మూడు స్థానాలు, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గెలుపొందారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సర్వేను 2023, డిసెంబర్ 15 నుంచి 2024, జనవరి 28 మధ్యలో నిర్వహించినట్లు ఇండియా టుడే తెలిపింది.