విధాత: బంధువుల అబ్బాయికి అమెరికా (America) ఆశ చూపించి.. ఇక్కడకు రప్పించుకుని బానిస (Exploitation) లా మార్చుకున్న ఒక భారతీయ అమెరికన్ జంటకు కోర్టు కఠిన శిక్ష విధించింది. దర్యాప్తు అధికారులు తెలిపిన ప్రకారం.. కుల్బీర్ కౌర్ (43), హర్మన్‌ప్రీత్ సింగ్ (30) దంపతులకు వర్జీనియాలో ఒక స్టోర్ ఉండేది. 2018లో భారత్‌లో ఉండే బంధువుల అబ్బాయి అయిన ఒక మైనర్‌కు అమెరికాలో చదువు చెప్పిస్తామని.. తగిన సాయం చేస్తామని ఈ బంధువులు నమ్మబలికారు. ఆ బాలుడు వీరి మాటలు నమ్మి ఇక్కడకు రాగానే అతడి ఇమిగ్రేషన్ పత్రాలను తీసేసుకుని వారి స్టోర్‌లో పనికి పెట్టేసుకున్నారు.
చెప్పినట్లు చేస్తేనే పత్రాలు భద్రంగా ఉంటాయని.. లేదంటే వాటిని నాశనం చేసేసి.. పోలీసులకు పట్టిస్తామని బెదిరించేవారు. కొన్ని సార్లు అతడి జుట్టు పట్టుకుని లాగడం, చెంప దెబ్బలు కొట్టడం, కాలితో తన్నడం వంటి అకృత్యాలకూ పాల్పడేవారు. వారాంతపు సెలవులు కూడా ఇవ్వకుండా గొడ్డు చాకిరీ చేయించుకునేవారు. ఆఖరికి ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు విచారణ జరిపి కోర్టులో కేసు వేశారు. వర్జినీయాలోని ఫెడరల్ జ్యూరీ ఇటీవల రెండు వారాల పాటు ఏకబిగిన ఈ కేసును విచారించింది. జరిగిన ఘటన దారుణమైందని పేర్కొంటూ కుల్బీర్ దంపతులను దోషులుగా ప్రకటించింది.
వీరికి 20 ఏళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానాలను శిక్షగా విధించింది. ఆ బాలుడిని అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంచి పనిచేయిచారని.. చాలీ చాలని జీతంతో ఎక్కువ పని గంటలు పనికి ఉపయోగించుకున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘బలవంతపు ఉద్యోగం, బానిసత్వం అనేవి ఈ సమాజంలో అంగీకరించలేని విషయాలు. ఈ కేసులో నిరంతర కృషి చేసిన ప్రాసిక్యూటర్స్, ఏజెంట్‌లు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ కేసులో బాధితుడికి న్యాయం జరిగింది’ అని అటార్నీ జెసికా డీ అబెర్ అన్నారు.