కీల‌క విన్యాసానికి సిద్ధ‌మైన ఆదిత్య ఎల్‌1.. ఉత్కంఠ‌గా ఇస్రో శాస్త్రవేత్త‌లు

సూర్యుణ్ని ప‌రిశీలించి అధ్య‌య‌నం చేయ‌డానికి ఇస్రో (ISRO) తొలిసారి పంపిన ఉప‌గ్ర‌హం ఆదిత్య ఎల్‌1 కీల‌క విన్యాసానికి సిద్ధ‌మ‌యింది

  • By: Somu    latest    Dec 26, 2023 11:41 AM IST
కీల‌క విన్యాసానికి సిద్ధ‌మైన ఆదిత్య ఎల్‌1.. ఉత్కంఠ‌గా ఇస్రో శాస్త్రవేత్త‌లు

విధాత: సూర్యుణ్ని ప‌రిశీలించి అధ్య‌య‌నం చేయ‌డానికి ఇస్రో (ISRO) తొలిసారి పంపిన ఉప‌గ్ర‌హం ఆదిత్య ఎల్‌1 (Aditya L1) కీల‌క విన్యాసానికి సిద్ధ‌మ‌యింది. గ‌మ్య‌స్థాన‌మైన లాంగ్రేజియ‌న్ 1 (ఎల్‌1) పాయింట్ వ‌ద్ద‌కు చేరుకునే క్ర‌మంలో హాలో ఆర్బిట్‌లో ప్ర‌వేశించ‌నుంది. ఈ విన్యాసం చేయ‌డానికి అత్యంత క‌చ్చిత‌మైన నావిగేష‌న్‌, కంట్రోలింగ్ అవ‌స‌ర‌మ‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు.



ఉప‌గ్ర‌హం త‌న దిశ‌లో స‌రిగ్గా వెళ్లేలా చూడ‌టం, హాలో ఆర్బిట్‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశించేలా చేయ‌డానికి క‌చ్చిత‌మైన విధానాన్ని అనుస‌రించ‌బోతున్నామ‌ని తెలిపారు. వ‌చ్చే నెల 6లోగా ఆదిత్య ఎల్‌1.. ఎల్‌1 పాయింట్‌ను చేరుకుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో) అధిప‌తి డా.ఎస్‌.సోమ‌నాథ్ ఇటీవ‌ల వెల్ల‌డించారు.



‘ఆదిత్య.. ఎల్‌1 పాయింట్‌కు చేరుకోగానే.. మేము దాని ఇంజిన్‌ను మండించాల్సి ఉంటుంది. అప్పుడే అది ముందుకు వెళ్లిపోకుండా ఎల్ 1 ప్రాంతంలో ఆగుతుంది. ఒక్క‌సారి గ‌నుక అది అక్క‌డ ఆగితే ఎల్‌1 చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక ర‌కంగా అది అక్క‌డ బందీ అయిన‌ట్లు’ అని ఆయ‌న వివ‌రించారు. సుమారు 5 ఏళ్ల పాటు ఆదిత్య మ‌న‌కు స‌మాచారం ఇస్తుంద‌ని.. భార‌త్‌కు సంబంధించే కాకుండా మొత్తం ప్ర‌పంచానికి ఉప‌యోగ‌ప‌డే మిష‌న్ ఇది అని ఇస్రో గ‌తంలోనే పేర్కొంది.



ఏడు పేలోడ్ల‌తో ప్ర‌యాణం…



ఈ ఏడాది సెప్టెంబ‌రులో ప్ర‌యోగించిన ఆదిత్య ఎల్‌1లో ఏడు పేలోడ్ల‌ను ఇస్రో శాస్త్రవేత్త‌లు ఏర్పాటు చేశారు. సోలార్ అల్ట్రావ‌యోలెట్ ఇమేజినింగ్ టెలిస్కోప్ (ఎస్‌యూఐటీ) అనేది అందులో ముఖ్య‌మైన‌ది. దీనితో తీసిన సూర్యుడి మొట్ట‌మొద‌టి ఫుల్ డిస్క్ చిత్రాత‌ల‌ను ఇస్రో ఇటీవ‌లే విడుద‌ల చేసింది. స‌న్‌స్పాట్స్‌, ప్లేజ్‌, నిద్రాణ సూర్యుని ఉప‌రిత‌ల ప్రాంతాలు ఆ చిత్రాల్లో క‌న‌ప‌డుతున్నాయి.



ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ సెంట‌ర్ ఫ‌ర్ ఆస్ట్రాన‌మీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) పుణెకు చెందిన 50 మంది శాస్త్రవేత్త‌లు దీని రూప‌క‌ల్ప‌న‌లో పాలుపంచుకున్నారు. సూర్యుడి ఫొటోస్పియ‌ర్‌, క్రోమోస్పియ‌ర్‌, సూర్యుని బాహ్య వ‌ల‌యాలు, క‌రోనాల‌ను ఈ పేలోడ్లు అధ్య‌య‌నం చేస్తాయి. ఎల‌క్ట్రోమాగ్నెటిక్, పార్టిక‌ల్‌, మ్యాగ్నెట్నిక్ ఫీల్డ్ డిటెక్ట‌ర్ సాయంతో ఈ ప‌రిశోధ‌న‌ల‌ను ఆదిత్య ఎల్‌1 నిర్వ‌హిస్తుంది.