Nalgonda: అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్.. 35 తులాల బంగారం, అర కేజీ వెండి స్వాధీనం

విధాత: అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 25 లక్షల విలువైన 35 తులాల బంగారం, అరకేజీ వెండి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా నల్గొండ జిల్లా ఎస్పీ కే.అపూర్వరావు వెల్లడించారు. ఈ కేసు వివరాలను సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో అందిన సమాచారం మేరకు నల్గొండ 2 టౌన్ సిఐ, సి.సి.యస్ సిబ్బంది సంయుక్తంగా పానగల్ ఇందిరాగాంధి చౌరస్తా […]

  • Publish Date - April 17, 2023 / 12:59 PM IST

విధాత: అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 25 లక్షల విలువైన 35 తులాల బంగారం, అరకేజీ వెండి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లుగా నల్గొండ జిల్లా ఎస్పీ కే.అపూర్వరావు వెల్లడించారు. ఈ కేసు వివరాలను సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు.

ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో అందిన సమాచారం మేరకు నల్గొండ 2 టౌన్ సిఐ, సి.సి.యస్ సిబ్బంది సంయుక్తంగా పానగల్ ఇందిరాగాంధి చౌరస్తా వద్ద వెహికిల్ చెకింగ్ చేపట్టారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకొని చెక్ చేయగా బంగారు, వెండి ఆభరణాలున్న కవర్ దొరికింది. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను విజయవాడ రాజ్య రాజేశ్వరి పేటకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ(శ్రీను)గా గుర్తించారు.

విజయవాడలో రౌడీ షీటర్‌గా ఉన్న తన తండ్రి నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దొంగగా మారి చిన్నతనం నుండి తాళాలు వేసి ఉండే ఇండ్లలో దొంగతనాలు చేసి పలుమార్లు వేంకటరమణ జైలుకు వెళ్లాడు. విజయవాడలో దొమ్మి కేసులు, యాసిడ్ దాడి కేసుల నేరాలకు పాల్పడ్డాడు. తరువాత విజయవాడ నుండి తణుకు వెళ్లి అక్కడ పాత సామాను వ్యాపారం చేస్తూ తాడేపల్లిలో తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకొని దొంగతనం చేశాడు. తాడేపల్లి నుండి హైదరబాద్‌కు వచ్చి బాల నగర్‌లో ఉంటూనే అప్పుడప్పుడు విజయవాడ, గుడివాడ ఏరియాకు వెళ్ళి దొంగతనం చేసి రావడం సాగించాడు. ఈ క్రమంలో విజయవాడ పోలీసులు పట్టుకొని జైలుకు పంపారు.

ఆ త‌ర్వాత 2014లో హైద్రాబాద్ పోలీసుల‌ ఆధ్వర్యంలో మైత్రి పోలీసు టిఫిన్ & టీ సెంటర్‌ను 2019 వరకు నడిపిన వెంకటరమణ రోడ్ వెడల్పులో భాగంగా టిఫిన్ & టీ సెంటర్ ను తీసివేయడంతో స్వయం ఉపాధి కోల్పోయాడు. ఆతర్వాత 2020-21లో కరోనా రావడంతో భార్యతో కలిసి జీవనోపాధి కోసం జనగాంలో ఉంటూ ప్రస్తుతం ఇస్తారాకుల వ్యాపారం చేస్తున్నాడు. ఇస్తారాకుల వ్యాపారంలో సంపాదించిన డబ్బులు కుటుంబ అవసరాలకి సరిపోక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాలలో దొంగతనాలు కొనసాగించాడు.

దోచుకున్న బంగారు ఆభరణాలను గుంటూరులో అమ్మడానికి వెలుతుండగా నల్గొండ పోలీసులకు చిక్కాడు. నిందితుడు నేరం ఒప్పుకోగా అతని పైన నల్లగొండ 2 టౌన్ నందు 8 కేసులు, నల్గొండ 1టౌన్ నందు 3 కేసులు, నల్గొండ రూరల్ 1 కేసు, సూర్యాపేట 2 టౌన్ 1 కేసు, మొత్తం 13 కేసులు నమోదు చేసి రిమాండుకి పంపించారు. గతంలో ఇతని పైన 300 కేసులు ఉన్నాయి.

కేసును నల్లగొండ డి.యస్.పి నరసింహ రెడ్డి పర్యవేక్షణలో చేధించిన 2 టౌన్ సిఐ చంద్రశేఖర్, సి.సి.యస్ సి.ఐ లు జితేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, యస్.ఐ రాజశేఖర్ రెడ్డి , ఏయస్ఐ లింగా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణు వర్దన్ గిరి, మోహిన్, లింగా రెడ్డి, శంశుద్దీన్ కానిస్టేబుల్ బాలకోటిలను జిల్లా ఎస్పీ అభినందించారు.