ఉన్నమాట: బీఆర్‌ఎస్ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన సత్తా ఏమిటో చూపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పెడుతున్న ఆయన ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు.
ఆయా నియోజకవర్గ కార్యాలయాలను ప్రారంభిస్తూ అధికారపార్టీకి సవాల్ విసురుతున్నారు. కొవిడ్ కారణంగా రైతు రుణమాఫీ చేయలేదని చెబుతున్న ప్రభుత్వం.. వందల కోట్లు ఖర్చు చేసి నూతన సచివాలయం ఎందుకు నిర్మిస్తున్నదని వైరాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి ప్రశ్నించారు. గొప్పలు, నామస్మరణ కోసం తప్ప తెలంగాణ బిడ్డల బాగోగులపై పాలకులు ఆలోచించడం లేదని విమర్శించారు.
అయితే ఆయన బీజేపీ, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు వెళ్తారని ప్రచారం జరిగినా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఏ పార్టీలోకి వెళ్లకుంగా స్వతంత్రంగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయంచుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖమ్మం పార్లమెంటుతో పాటు, పది అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సీట్లను దక్కించుకుని ఎన్నికల అనంతరం అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు.
పినపాకలో పొంగులేటి- పాయం పేరుతో ఏర్సాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన పొంగులేటి అనంతరం మాట్లాడుతూ.. కార్యకర్తలు తాటాకు చప్పుళ్లకు భయపడొద్దని వచ్చే ఎన్నికల్లో పాయం వెంకటేశ్వర్లును గెలిపించాలని కోరారు. మన నేతను గెలిపించుకుని ఆశించిన ఫలితాలు సాధిద్దామని అన్నారు.
మరోవైపు పొంగులేటి దూకుడు వెనుక ఎవరు ఉన్నారనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. కానీ ఆయన మొత్తం పది స్థానాల్లో తన అనుచరులను నిలబెట్టి అదీ స్వతంత్రంగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌తో విభేదాల అనంతరం ఆయన వైఎస్ షర్మిలను కలిశారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఆయన పార్టీలోకి వస్తే తనకు అభ్యంతరం లేదని ఇప్పటికే ప్రకటించారు. అలాగే బీజేపీ నేతలు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కానీ ఆ పార్టీవైపు మొగ్గు చూపకుండా స్వతంత్రంగా వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు? అధికార పార్టీ అధినేత వ్యూహం ఏదైనా ఉన్నదా? అనే చర్చ జరుగుతున్నది.
ఎందుకంటే రెండుసార్లు అధికారంలోకి వచ్చినా అధికార పార్టీ అక్కడ 2014లో ఒకటి, 2018లో ఒక్క స్థానానికే పరిమితం కావడం గమనార్హం. కేసీఆర్ నిరాహార దీక్ష సందర్బంగా ఆయనను ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించినప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా కదిలి వచ్చారు.
కేసీఆర్‌కు జై కొట్టిన ఖమ్మం జనాలు ఎన్నకల్లో మాత్రం ఆయన పార్టీని రెండు సార్లు ఒక స్థానంతోనే సరిపెట్టారు. అయితే పొంగులేటి మొత్తం పది స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించబోతుండడంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే బీఆర్‌ఎస్ అధినేత ఆయనతో ఈ పని చేయించారా? లేక కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండే ఈ కోటలో కాషాయ జెండా ఎగరవేయడానికి ఆ పార్టీ అమలు చేస్తున్న వ్యూహమా? అన్నది చర్చ జరుగుతున్నది.