విధాత: తన సభలకు భారీగా జనం వస్తుండడంతో హుషారుగా జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు జోరుకు నిన్నటి కందుకూరు ప్రమాదం కళ్లెం వేసినట్లే అయింది. కేవలం చంద్రబాబు ప్లానింగ్.. అంటే ఇరుకైన రోడ్లలో భారీగా జనాన్ని పోగేసి ఆ జనాన్ని మరింత ఎక్కువ చేసి చూపించే ఉద్దేశంతోనే ఇలాంటి చోట మీటింగ్ పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది.
చంద్రబాబు తన ప్రయోజనం కోసం ప్రజల్ని బలి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ మీద చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ వైసీపీ ఇప్పుడు వినియోగిస్తుంది.మొత్తం 8 మంది చనిపోవడం.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ ఘటన పెద్దగానే భావించాల్సి ఉంటుంది. పార్టీ తరఫున, వ్యక్తిగతంగా చంద్రబాబు ఎంత ఎక్కువగా ఆర్థిక సాయం చేసినా గానీ ఆ దుర్ఘటన తాలూకు పర్యవసానాలు మాత్రం ఆయన్ను వెంటాడుతాయ్. ఈమేరకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలోఈ ఘటనను బూచిగా చూపించి కేసుల కొరడా ఝళిపిస్తారని అంటున్నారు. సభ నిర్వాహకులు సరైన చర్యలు చేపట్టలేదనే కారణంగా కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. ఈ ప్రమాదాన్ని సాకుగా చూపి భవిష్యత్తులో జరిగే సభలకు అనుమతులు ఇవ్వకుండా నిలువరించడంతోపాటు.. నిబంధనలు కఠినతరం చేయడం.. ప్రజలను అభిమానులను నిలువరించడం.. వంటివి తెర మీదికి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక ప్రమాదం.. మున్ముందు జరిపే టీడీపీ సభలను ప్రభావితం చేస్తుందని.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని టీడీపీకి ఇబ్బందులు పెట్టె అవకాశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు.