విధాత: మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ఓటమికి కారణాలు ఏమిటి అనే చర్చ ఇప్పటికీ జోరుగా సాగుతున్నది. అయితే అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను ఉపయోగించి తమకు అడ్డంకులు సృష్టించిందని బీజేపీ నేతలు ఫలితాల అనంతరం ప్రకటించారు. ఇది వాస్తవమేనా? లేక సొంత పార్టీ నేతల వ్యవహారశైలే కోమటిరెడ్డి రాజగోపాల్ కొంప ముంచిందా? అంటే అవుననే అంటున్నారు.
బీజేపీ అధిష్ఠాన పెద్దలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజగోపాల్‌ను ఉప ఎన్నికకు సిద్ధం కావాలన్న ప్పుడే పరిస్థితి అంత అనుకూలంగా లేదని అప్పుడే చెప్పాడట. ముందు తాను నియోజకవర్గంలోని నేతలను, కార్యకర్తలను సన్నద్ధం చేసుకున్న తర్వాతే ఒక స్పష్టత వస్తుందని కుండబద్దలు కొట్టాడట.
వ్యక్తిగతంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇలా అన్ని రకాలుగా బలమైన రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి బీజేపీ ఒక ప్రయోగం చేసిందనే చెప్పాలి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ బలనిరూపణకు మునుగోడును రాజకీయ వేదికగా మలుచుకున్నదన్నది వాస్తవం.
అయితే ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ వరకు రాజగోపాల్‌రెడ్డి ప్రచారం చేసిన తీరు చూస్తే పార్టీ కంటే తన వ్యక్తిగత ఇమేజ్‌నే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ప్రజల్లోనూ ఆయన పేరే వినిపించింది. కానీ ఆయన గెలుపు కావాల్సిన ప్రభావాన్ని బీజేపీ పార్టీ చూపెట్టలేకపోయింది.
కీలకమైన చివరి వారం పదిరోజుల ప్రచార సమయంలో ఉప ఎన్నిక ఇన్‌ఛార్జిగా ఉన్న వివేక్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎవరికి వారే సమీక్షల పేరుతో ఆయనను నియోజకవర్గంలో ఎక్కువగా తిరగకుండా చేశారనే టాక్ ఉన్నది.
నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ఆయన ఓటమికి కారణం అయ్యాయని ఆ నియోజకవర్గంలోని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారట. పైకి తన ఓటమికి కమ్యూనిస్టులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఉపయోగించిందని చెబుతున్నా లోలోపల మాత్రం బీజేపీ రాష్ట్ర నేతలే కారణం అని రాజగోపాల్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.