విధాత: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన (ISRO) ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ55 ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది పీఎస్ఎల్వీ. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందింది. 228 టన్నుల బరువు ఉన్న పీఎస్ఎల్వీ.. 57వ సారి విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది.
ఈ ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటలకు ప్రారంభమైంది. 25:30 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎస్ఎల్‌వీ వాహననౌక నింగిలోకి దూసుకెళ్లింది.
TeLEOS-2, లుమిలైట్ -4 అనే రెండు ఉపగ్రహాలు సుమారు 757 కిలోల బరువు ఉన్నట్ల సైంటిస్టులు పేర్కొన్నారు. TeLEOS-2 ఉపగ్రహం ద్వారా పగలు, రాత్రి వెదర్ రిపోర్ట్‌ను ఇవ్వనున్నారు. ఈ ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది. కాగా దీన్ని ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. TeLEOS-2 ఉపగ్రహం 741 కేజీల బరువు ఉంది.
ఇక రెండో ఉపగ్రహం లుమిలైట్ -4. దీని లక్ష్యం సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం. లుమిలైట్ 16 కిలోల బరువు ఉంది. లుమిలైట్‌ను ఇన్‌ఫోకమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, శాటిలైట్ టెక్నాలజీ అండర్ రీసెర్చ్ సెంటర్ డెవలప్ చేశాయి. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన మూడవ అతిపెద్ద ప్రయోగం ఇది