కుక్క‌ల విస‌ర్జితాల‌ను తీయ‌లేరా? రోడ్ల ప‌రిశుభ్ర‌త‌పై క‌ఠిన నిర్ణ‌యం

వీధుల్లో పెంపుడు కుక్క‌ల మూత్ర విస‌ర్జ‌నలు పెరిగిపోయి అపారిశుద్ధ్యం తాండ‌విస్తుండ‌టంతో ఓ దేశంలోని స్థానిక ప్ర‌భుత్వం క‌ఠినమైన నిర్ణ‌యం తీసుకుంది

  • Publish Date - January 18, 2024 / 11:16 AM IST

వీధుల్లో పెంపుడు కుక్క‌ల మూత్ర విస‌ర్జ‌న (Dog Poop) లు పెరిగిపోయి అపారిశుద్ధ్యం తాండ‌విస్తుండ‌టంతో ఓ దేశంలోని స్థానిక ప్ర‌భుత్వం క‌ఠినమైన, విచిత్ర‌మైన‌ నిర్ణ‌యం తీసుకుంది. అక్క‌డ కుక్క‌ల‌ను పెంచుకుంటున్న వారందరి వివ‌రాల‌నూ తీసుకుని… ఆ శున‌కాలు డీఎన్ఏను సేక‌రంచాల‌ని ఆదేశించింది.


ఎక్క‌డైనా కుక్క మ‌లం క‌న‌ప‌డితే ఆ డీఎన్ఏను త‌మ వ‌ద్ద డీఎన్ఏతో పోల్చి చూస్తామ‌ని.. ఆ య‌జ‌మానికి భారీ జ‌రిమానా విధిస్తామ‌ని కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చింది. ప‌ర్యాట‌కుల క‌ల‌ల దేశ‌మైన ఇట‌లీ (Italy) లోని బొల్జానో ప్రావిన్స్ ఈ క‌ఠిన నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నుంది. కుక్క‌ల విస‌ర్జితాల‌తో వీధులు మొత్తం మురికిగా మారి ప‌ర్యాట‌కులు ఇబ్బందులు ప‌డుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది.


డీఎన్ఏ డేటాబేస్‌ను నిర్వ‌హించ‌డం ద్వారా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పెంపుడు కుక్క‌ల య‌జ‌మానుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా త్వ‌రలోనే ఇక్క‌డ కుక్క‌ల నుంచి డీఎన్ఏను సేక‌రించే ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.


ఈ డేటాబేస్‌ను వీధి పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య అధికారుల‌కు యాక్సెస్ ఇస్తారు. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను బ‌ట్టి, ఎన్ని సార్లు నిర్ల‌క్ష్యం వ‌హించార‌న్నదానిని బ‌ట్టి 50 (రూ.4,500) నుంచి 500 యూరోలు (రూ.45,000) వ‌ర‌కు జ‌రిమానా విధించే అధికారం వీరికి ఉంటుంది. ఒక అంచ‌నా ప్ర‌కారం ఈ ప్రావిన్సులో సుమారు 40 వేల వ‌ర‌కు పెంపుడు శున‌కాలు ఉన్నాయి.


గ‌త నెల నుంచే స్థానిక వెట‌ర్న‌రీ ఆసుప‌త్రుల‌లో డీఎన్ఏ సేక‌ర‌ణ ప్రారంభ‌మైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఒక వేళ ఎవ‌రైనా త‌మ పెంపుడు కుక్క డీఎన్ఏ సేక‌ర‌ణ‌కు అనుమ‌తించ‌క‌పోయినా.. మార్చిలోపు వివ‌రాలు ఇవ్వ‌క‌పోయినా వారికి 1,048 యూరోల వ‌ర‌కు జ‌రిమానా విధించే ప్ర‌మాదం ఉంది.


బోల్జానో న‌గ‌రంతో పాటు చుట్టుప‌క్క‌ల న‌గ‌రాల్లో ఇప్ప‌టికే 10 వేల మంది డీఎన్ఏ న‌మూనాలు ఇచ్చార‌ని వెట‌ర్నరీ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్ పావోలో జంబాటో వివ‌రించారు. ఏటా త‌మ‌కు 100కుపైగా ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని.. కానీ వాటిల్లో 3 లేదా 4 కేసుల్లో మాత్ర‌మే కుక్క‌ల య‌జ‌మానుల‌కు జ‌రిమానా విధించ‌గ‌లుగుతున్నామ‌ని ఆయ‌న అన్నారు.


ప్ర‌స్తుత విధానంలో వీలైనంత మంది చ‌ట్ట‌ప‌రిధిలోకి తీసుకొచ్చే అవకాశ‌ముంటుంద‌ని పేర్కొన్నారు. కేవ‌లం విస‌ర్జితాల విష‌యంలోనే కాకుండా వాహ‌నాల కింద ప‌డి ఏ కుక్క అయినా చ‌నిపోయినా, ఎవ‌రిపైనైనా అది దాడి చేసినా, లేదా దాని య‌జ‌మానులు అనాథ‌లా వ‌దిలేసినా డీఎన్ఏ డేటాబేస్ ద్వారా ముందుకు వెళ్లొచ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.


అయితే ఈ నిబంధ‌న‌కు ఖ‌ర్చు త‌డిపిమోపెడ‌వుతుంద‌ని… ఈ భారాన్ని మున్సిపాలిటీలు భ‌రించ‌లేవ‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. ఒక వేళ రోడ్లను పాడుచేసేవి వీధి కుక్క‌లు, ప‌ర్యాట‌కుల కుక్క‌లు అయితే ఎవ‌రిని శిక్షిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.