Jagadish Reddy | బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో చేశామని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు

  • Publish Date - January 29, 2024 / 11:38 AM IST
  • శాశ్వతంగా గుర్తుండేలా పనులు
  • ప్రజాప్రతినిధుల పనితీరు అమోఘం
  • పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి
  • చివ్వెంల మండల సమావేశంలో
  • సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
  • సర్పంచులకు ఘన సన్మానం


Jagadish Reddy | విధాత, సూర్యాపేట: గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో చేశామని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాల్లో శాశ్వతంగా గుర్తుండేలా అభివృద్ధి జరిగిందన్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల పనితీరు అమోఘమని కొనియాడారు.


దేశంలో ఏ అవార్డు ప్రకటించినా తెలంగాణకు వరించడమే దీనికి నిదర్శనం అన్నారు. ఈపరిణామమే దేశాన్ని జోన్లుగా విభజించేలా కేంద్ర ప్రభుత్వం పాలసీనే మార్పు చేసే విధంగా స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ గ్రామాలకు ఇక్కడి పట్టణాలే పోటీ అన్నారు. పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల కృషి ఎనలేనిదన్న ఆయన.. ప్రభుత్వం ఉద్యమంలా కొనసాగించిన హరితహారం కారణంగా మూడు శాతం ఉన్న అడవులు ఏడు శాతానికి పెరిగాయన్నారు. దీనిలో స్థానిక నాయకత్వాన్నిదే ప్రధాన భూమిక అన్నారు.


సేవ చేసే వారిని ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న జగదీష్ రెడ్డి, ప్రజల ఆశీస్సులతో మరోసారి ప్రజాప్రతినిధులుగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం మరో రెండు రోజుల్లో పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లను జగదీష్ రెడ్డి సన్మానించారు. ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ సంజీవ నాయక్, వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ సుధీర్ రావు, ఎంపీడీవో లక్ష్మి, ఎంపీఓ గోపి, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొన్నారు.