విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాన్ గతంలోనే ప్రకటించారు. అయితే ఆయన ఇక్కడ పార్టీ నిర్మాణమేమీ చేయ లేదు. గత ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసిన జనసేన.. ఒక్క సీటుకే పరిమితమైంది. పవన్‌కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే.. రెండింటిలోనూ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేసే అవకాశాలపై చర్చ నడిచింది. ఒకవేళ ఇక్కడ పోటీ చేసినా.. హైదరాబాద్ నగరంలోని ఐదారు చోట్ల, అదే సంఖ్యలో ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను నిలుపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఇక్కడ 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి జాబితా విడుదల చేశారు. ఈ నియోజకవర్గాల్లో పవన్ వారాహియాత్ర, సభలు కూడా ఉంటాయని ప్రకటించారు.
జనసేన పోటీ చేస్తున్న జాబితా చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండబోతున్నదని ఇప్పటికే అనేక అంచనాలు వెలువడ్డాయి. ఇరు పార్టీలు అధికారానికి అవసరమైన మెజారిటీ సాధించే అవకాశాలు లేవని కూడా కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు 40-45 స్థానాలు గెలువొచ్చని, 15 స్థానాల్లో త్రిముఖ పోరు ఉంటుందని తెలిపాయి. అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకే అధికారం దక్కుతుందని కొన్ని అంచనాలు పేర్కొంటున్నాయి.
ఈ లెక్కన బీఆర్‌ఎస్‌కు వచ్చే సీట్లు, ఎంఐఎం (5-7) మద్దతు ఇచ్చినా ఇంకా 10-12 స్థానాలు అవసరం ఉండొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల ప్రకటనకు ముందున్న లెక్కలు మారిపోతున్నాయి. మరోవైపు అధికారపార్టీలో అంతర్గత కలహాలు, నేతల మధ్య వర్గపోరుతో బీఆరెస్‌కు సీట్ల సంఖ్య అంచనా వేసిన దానికన్నా తగ్గే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఈ లెక్కన పార్టీ గెలుపు నల్లేరు నడక కాదని గ్రహించిన బీఆర్‌ఎస్ అధిష్ఠానం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశాల కోసం చూస్తున్నదని అంటున్నారు.
జనసేన జాబితాలోని ఉప్పల్, వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, రామగుండం, కోదాడ నియోజకవర్గాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంతపార్టీ నేతల రోడ్డెక్కారు. వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రి హరీశ్ రావు పెత్తనాన్ని నిరసిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన కుమారుడు మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తాడని ప్రకటించారు. ఆయన వ్యవహారశైలిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్పుపట్టి పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే నాయకులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు.
దీంతో ఆయన కారు దిగి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ బలంగానే ఉన్నది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో మెజారిటీ సీట్లు సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాల్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, కాంగ్రెస్ వైపు ఆ ఓట్లు వెళ్లకుండా జనసేన పోటీ అవకాశం కల్పిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
జనసేన ప్రకటించిన జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9 సీట్లు, ఉమ్మడి జల్లాలైన ఖమ్మంలో 8, వరంగల్‌లో 5, నల్లగొండలో 4, కరీంనగర్‌లో 4 మిగిలిన రెండు స్థానాలు నాగర్‌కర్నూల్, ఖానాపూర్ ఉన్నాయి. జనసేన పోటీ చేయనున్న జాబితా చూస్తే ఆ పార్టీ పోటీ.. ఎవరికి లబ్ధి కలిగిస్తుందో ఇట్టే అర్థమౌతుందని అంటున్నారు. జనసేన పోటీ.. కాంగ్రెస్‌కు విజయాకాశాలను దూరం చేసే ప్రయత్నమేనని తేల్చేస్తున్నారు.
త్రిముఖ పోరు ఉన్నచోట్ల గెలిచే అభ్యర్థి మెజారిటీ కనిష్ఠంగా 1000 నుంచి గరిష్ఠంగా 10000 ఓట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే.. ఈ మాత్రం ఓట్లను జనసేన సాధించగలదా? అన్న ప్రశ్న కూడా ఉన్నది. జనసేన అధినేతకు జనాకర్షణ శక్తి ఉన్నది కానీ.. ఓట్లను రాబట్టుకునే శక్తి లేదని మరికొందరు అంటున్నారు. పవన్ దృష్టి మొత్తం ఏపీపైనే ఉంటుందని, ఇక్కడ పోటీ నామమాత్రమే అవుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేంత శక్తి జనసేనకు ఉండదని అంటున్నారు.