వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి ఏకపక్ష నిర్ణయం.. జర్నలిస్టుల ఆగ్రహం
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా ఇల్లు కేటాయించాలని వర్దన్నపేట వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా ఇల్లు కేటాయించాలని వర్దన్నపేట వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిపాలనాధికారి శ్రీకాంత్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వర్కింగ్ జర్నలిస్టులపై చూపుతున్న వివక్షను వివరించారు. స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్ కొంతమంది జర్నలిస్టులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే విధంగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరైంది కాదని తెలిపారు. జర్నలిస్టుల్లో చీలికలు తెచ్చి గ్రూపులను ప్రోత్సహించే విధంగా తనకు అనుకూలంగా ఉండే కొంతమంది జర్నలిస్టులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే తీరు మిగతా సీనియర్ జర్నలిస్టులను కించపరిచే విధంగా ఉందన్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు పట్ల సమగ్ర విచారణ జరిపి, ప్రతి జర్నలిస్టుకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్ రావును హన్మకొండలోని డీసీసీ బ్యాంకు కార్యాలయంలో వర్దన్నపేట జర్నలిస్టులు మర్యాద పూర్వకంగా కలిసి, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనికి మార్నేని సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా ఎమ్మెల్యేతో చర్చిస్తానని తెలిపారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు శ్రీరాం రమేష్, ఆత్మకూరి రాధాకృష్ణ, మహ్మద్ అజీజుద్దీన్, అలువాల బిక్షపతి, అయిత ప్రవీణ్ కుమార్, దొమ్మటి భాను, బిర్రు కుమారస్వామి, రాజేందర్, నాంపల్లి మల్లేశం, బుర్ర వెంకటరమణ, మిట్టపల్లి రవి పవన్, నరేష్, మురళి, కంజర్ల భాస్కర్ పాల్గొన్నారు.