టీడీపీ తరపున Jr.Ntr ప్రచారానికి వస్తాడు: తారకరత్న

విధాత‌: తెలుగుదేశానికి శక్తి సన్నగిల్లుతున్నపుడు గానీ.. మరింత శక్తి, దమ్ము ఉంటే తప్ప రాజకీయ పోరాటం చేయలేము అనుకున్నపుడు గానీ మళ్ళీ పార్టీ క్యాడర్, హై కమాండ్‌కు జూనియర్ ఎన్టీఆర్ యాదికి వస్తూనే ఉంటాడు. గతంలో 2009లో కూడా ఇలాగే జూనియర్ టీడీపీ ప్రచారంలో పాల్గొన్నాడు. ఆ తరువాత పార్టీలో ఆయన పేరు గానీ ఉనికి గానీ వినిపించకుండా కనిపించకుండా చంద్రబాబు జాగ్రత్తలు పడ్డారు. మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా టీడీపీలో యాక్టివ్ రోల్ తీసుకుంటే […]

  • Publish Date - December 19, 2022 / 11:09 AM IST

విధాత‌: తెలుగుదేశానికి శక్తి సన్నగిల్లుతున్నపుడు గానీ.. మరింత శక్తి, దమ్ము ఉంటే తప్ప రాజకీయ పోరాటం చేయలేము అనుకున్నపుడు గానీ మళ్ళీ పార్టీ క్యాడర్, హై కమాండ్‌కు జూనియర్ ఎన్టీఆర్ యాదికి వస్తూనే ఉంటాడు. గతంలో 2009లో కూడా ఇలాగే జూనియర్ టీడీపీ ప్రచారంలో పాల్గొన్నాడు.

ఆ తరువాత పార్టీలో ఆయన పేరు గానీ ఉనికి గానీ వినిపించకుండా కనిపించకుండా చంద్రబాబు జాగ్రత్తలు పడ్డారు. మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా టీడీపీలో యాక్టివ్ రోల్ తీసుకుంటే పార్టీ క్యాడర్, ఎమ్మెల్యేలు సైతం మళ్ళీ అటువైపు మొగ్గితే తనకు, తన కొడుకు లోకేశ్‌కు మున్ముందు ఇబ్బంది అవుతుందన్న భయంతో చంద్రబాబు ఎప్పుడు ఎవర్నీ ఎక్కడ ఉంచాలో అక్కడే..అంతవరకే వాడుతూ వస్తున్నారు.

ఆ ఎపిసోడ్ పూర్తవగానే ఆ పాత్రను అక్కడితో ముగించేస్తారు. ఇప్పుడు మళ్లీ టిడిపికి ఎన్టీయార్ అవసరం కనిపిస్తోంది. అటు జగన్ను ఎదుర్కోవడం తమకు సాధ్యం కాని విధంగా ఉంది. అందుకే మళ్ళీ జూనియర్ ప్రస్తావన తెస్తున్నారని ప్రజల్లో టాక్..

బహుశా 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ఎన్టీఆర్‌కు సోదరుడయ్యే నందమూరి తారకరత్న వివరించారు. ఆయన తాజాగా గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి తప్పకుండా వస్తారు. అయితే అది ఎప్పుడన్నది ఆయన తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.

తామంతా టీడీపీ సభ్యులమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ తమదని ఆయన చెప్పుకున్నారు. నందమూరి కుటుంబం పదవుల కోసం ఏ రోజూ ఆరాట పడలేదని ఆశ పడలేదని అన్నారు. రేపటి రోజున రాష్ట్రం బాగుండాలంటే తప్పకుండా టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందే అని ఆయన అన్నారు. త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తగా పని చేశానని, నాయకుడిని కూడా అవుతానేమోనని వ్యాఖ్యానించారు.

తామంతా చంద్రబాబు వెంట ఉంటూ.. ఆయనకు అండగా ఉంటామని తారకరత్న చెప్పడం విశేషం. అయితే ఎన్టీఆర్ బరిలోకి దిగి ప్రచారం చేసినంత మాత్రాన పరిస్థితులు తారుమారైపోతాయని.. ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని చెప్పలేం. గతంలో 2009లో సిక్కోలు నుంచి రాయలసీమ వరకూ ఎన్టీఆర్ ప్రచారం చేసినా ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చిందన్నది అందరికి తెలిసిందే.