విధాత, సినిమా: ‘ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం’ అంటూ రామ్ చరణ్‌ని ఉద్దేశించి ‘RRR’ చిత్రంలో ఎన్టీఆర్‌కి ఓ డైలాగ్ ఉంటుంది. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి మాత్రం.. ప్రాణం లేదు, సోపతి లేదు అన్నట్లుగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల తీరు ఉంది. వారిద్దరూ ‘RRR’ ప్రమోషన్స్ కోసమే.. మా మధ్య ఉన్నది సోదరబంధం అని చెప్పారా? అనేలా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే, ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆస్కార్ అవార్డును పట్టుకొచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ వంటి వారందరినీ ఆ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా సన్మానించారు.
అయితే ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చిన ఆ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. అలాగే బాలయ్య కూడా కనిపించలేదు. దీంతో నందమూరి ఫ్యామిలీని చిరు పిలవలేదా? దూరం పెట్టేశారా? అంటూ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
సేమ్ టు సేమ్, టిట్ ఫర్ టాట్ అనేలా.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన ఫ్రెండ్స్ మరియు శ్రేయోభిలాషులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారెవరూ కనిపించ లేదు. మరీ ముఖ్యంగా ‘RRR’ సినిమాలో కలిసి నటించిన, ప్రమోషన్స్‌లో సోదరులం అని చెప్పిన రామ్ చరణ్ ఈ వేడుకలో ఎక్కడా కనిపించలేదు.
అలాగే టాలీవుడ్ హీరోలెవరూ కనిపించలేదు. అంటే.. ఎన్టీఆర్‌కి బాగా కావాల్సిన వారికి మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానం దక్కినట్లుగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ జక్కన్నగా పిలుచుకునే రాజమౌళి, స్వామి అని పిలుచుకునే త్రివిక్రమ్ వంటి వారంతా ఈ పార్టీలో కనిపించారు. మరీ ముఖ్యంగా అమెజాన్ స్టూడియోస్ అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఈ పార్టీకి హాజరైనందుకు ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇంకా ఈ పార్టీలో దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, శోభు యార్లగడ్డ, బాపినీడు, రాజమౌళి తనయుడు కార్తికేయ, ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు కొరటాల శివ వంటి వారంతా ఈ పార్టీకి హాజరైనట్లుగా.. ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే తెలుస్తుంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఈ ఫొటోలలో కనిపించారు.
మొత్తం పార్టీ ఏమో కానీ.. ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అంటూ రామ్ చరణ్‌ని ఈ పార్టీకి పిలవకపోవడమే ఇప్పుడంతా చర్చలకు తావిస్తోంది. ఒకవేళ రామ్ చరణ్ ఫారిన్‌లో ఉండటం (రీసెంట్‌గా భార్యతో కలిసి వెకేషన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు) కారణంగా ఈ పార్టీకి హాజరు కాలేదు అనుకోవడానికి.. ఆయన బుధవారమే హైదరాబాద్ వచ్చేశారు.
ఒకవేళ ఈ పార్టీకి చరణ్ హాజరైనప్పటికీ ఎన్టీఆర్ ఫొటోలు పెట్టలేదా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ ఫొటోలలో ఎక్కడా కనిపించలేదు. అది విషయం.