విధాత: ఇంట్లో మంటలు చెలరేగడంతో భయపడిన 13 ఏండ్ల బాలిక భవనంపై నుంచి దూకేసింది. రెండో అంతస్తు నుంచి దూకేయడంతో మరణించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇంట్లో మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక భవనంపై నుంచి దూకేయడంతో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లోనే ఉన్న బాలిక సోదరుడు, తల్లికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
“సోమవారం తెల్లవారుజామున ఇంట్లో మంటలు చెలరేగి రెండవ అంతస్తుకు వ్యాపించడంతో ఏంజెల్ జైన్ అనే 14 ఏండ్ల బాలిక భవనం పై నుంచి కిందికి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు” అని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యష్ బిజోలియా మీడియాకు చెప్పారు.
మహారాష్ట్రలోని పుణె ప్రాంతానికి చెందిన జైన్ కుటుంబ సభ్యులు ఇటీవలే మధ్యప్రదేశ్ సాగర్‌లోని రాంపుర ప్రాంతంలోని బంధువుల ఇంటికి వచ్చారని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలినట్టు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.