విధాత, కామారెడ్డి: కామారెడ్డి (Kamareddy) జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలో అక్కాపూర్, మైసమ్మ చెరువు గ్రామాల మధ్య ప్రాంతంలో దుర్గమ్మ గుడి తండా సమీపంలో కొందరు వ్యక్తులు అటవీ భూమిని చదును చేస్తున్న సమాచారం మేరకు స్థానిక అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ భూమిని చదును చేస్తున్న వ్యక్తులను అడ్డుకున్నారు.
దీంతో కోపోద్రోక్తులైన తండావాసులు అటవీ అధికారులకు తండావాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తండా వాసులు చదును చేస్తున్న ట్రాక్టర్లను తీసుకొని పారిపోయారు. అటవీ అధికారులను తండావాసులు నిర్బంధించారు.
అక్కడే డ్యూటీలో ఉన్న బీట్ ఆఫీసర్ ప్రశాంత్ పై తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీట్ ఆఫీసర్ ప్రశాంత్ ఉన్నతాదికారులకు సమాచారం చేర వేయడంతో సంఘటనా స్థలానికి స్థానిక సెక్షన్ ఆఫీసర్ పవన్ తన సిబ్బందితో చేరుకొని తండా వాసులను చెదరగొట్టారు.
దీంతో తండావాసులకు అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ రమేష్ మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి పోలీసులు తెలిపారు.