Karimnagar | హుజురాబాద్‌లో దిగజారుతున్న శాంతి భద్రతలు: ఈటల
Karimnagar ఆ బాధ్యత మేమే తీసుకోవాల్సి వస్తుంది ప్రజలు, ప్రజాప్రతినిధులే కాదు.. విలేకరులను బెదిరిస్తున్నారు మనం ఉన్నది ప్రజాస్వామ్య పాలనలోనా? నియంతృత్వం లోనా? సీఎం ఈ రాష్ట్రానికి యజమాని కాదు, ప్రజల సొమ్ముకు కాపలాదారుడు కెసిఆర్ నివసించే ప్రగతిభవన్ ఆయన తిని అన్నం మెతుకులు ప్రజలవే రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల మండిపాటు విధాత బ్యూరో, కరీంనగర్: ఉప ఎన్నికల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టినా, ప్రజలు చెంప చెల్లుమనిపించడంతో కొంతమంది వ్యక్తులకు దొడ్డి దారిన పదవులు ఇచ్చి […]

Karimnagar
- ఆ బాధ్యత మేమే తీసుకోవాల్సి వస్తుంది
- ప్రజలు, ప్రజాప్రతినిధులే కాదు.. విలేకరులను బెదిరిస్తున్నారు
- మనం ఉన్నది ప్రజాస్వామ్య పాలనలోనా? నియంతృత్వం లోనా?
- సీఎం ఈ రాష్ట్రానికి యజమాని కాదు, ప్రజల సొమ్ముకు కాపలాదారుడు
- కెసిఆర్ నివసించే ప్రగతిభవన్ ఆయన తిని అన్నం మెతుకులు ప్రజలవే
- రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల మండిపాటు
విధాత బ్యూరో, కరీంనగర్: ఉప ఎన్నికల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టినా, ప్రజలు చెంప చెల్లుమనిపించడంతో కొంతమంది వ్యక్తులకు దొడ్డి దారిన పదవులు ఇచ్చి నియోజకవర్గ ప్రజలపై దౌర్జన్యాలు చేయిస్తున్నారని హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు.
గురువారం ఆయన హుజురాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు
తమ పార్టీ నేతలను అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో ఆయనే అందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు తమను, తాము కాపాడుకోవడానికి అధికార పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలు చేజారకముందే పోలీసులు మేల్కొనాలని, లేకుంటే ఆ బాధ్యత తామే తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పాలన చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు, ప్రజాప్రతినిధులే కాదు, పత్రిక విలేకరులపై వేధింపులు, బెదిరింపులు పెరిగిపోయాయి అన్నారు.
నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి బాధ్యత మరిచి సైకో మాదిరిగా, గుండా మాదిరిగా వ్యవహరిస్తూ ఇటీవలి కాలంలో సివిఆర్ విలేకరి చందు, తాజాగా జిఎస్ఆర్ విలేకరి అజయ్ సెల్ ఫోన్లు గుంజుకోవడం, వారిని బెదిరించడం దారుణం అన్నారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముఖ్యమంత్రి కట్టించింది కాదని, ఇది వాళ్ళ అయ్య జాగీరు కూడా కాదని ఈటెల మండిపడ్డారు. క్యాంపు కార్యాలయం ముఖ్యమంత్రి కట్టించారని ఓ ప్రజా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మాడి మసైపోతారని హెచ్చరించారు.
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ప్రజలదే అని, ముఖ్యమంత్రి తినే అన్నం మెతుకులు కూడా ప్రజలు ఇచ్చే డబ్బుతోనేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి యజమాని కాదని, ప్రజల సొమ్ముకు కాపలాధారు మాత్రమే అని చెప్పారు.
తెలంగాణ 9 ఏళ్ల పాలనలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులకు ఒరిగింది ఏమీ లేదు అన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలకు రావాల్సిన 3700 కోట్ల వడ్డీ లేని రుణాలకు నేటికీ అతిగతి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఈ ప్రభుత్వం ప్రతినెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తాజాగా వెయ్యి కోట్లు ఖర్చు చేసి దశాబ్ది సంబరాలు జరిపినా, పెట్టింది తిని, పోసింది తాగిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
శాసనసభ ఎన్నికల్లో సర్వే సంస్థలకు కూడా అంతు పట్టని విధంగా ఫలితాలు ఉంటాయన్నారు. ప్రజల అంతరంగం ఈ ప్రభుత్వానికి అంతు పట్టడం లేదన్నారు. హుజురాబాద్ పట్టణంలో ఉద్యమకారులు నిర్మించిన అమరుల స్మారక స్థూపాన్ని కూల్చి కొత్త స్థూపాన్ని ఏర్పాటు చేసి మానుకోట ఉద్యమకారులపై రాళ్లు రువ్విన, రక్తం కళ్ల చూసిన వారితో ప్రారంభించడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
ఈ శిలాఫలకం ఏర్పాటు సందర్భంలో స్థానిక శాసనసభ్యున్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించారని, ఇలాంటి పిచ్చి సంప్రదాయాన్ని రేపు వచ్చే ప్రభుత్వం కొనసాగిస్తే మీ గతి ఏంటని ప్రశ్నించారు.
చేతిలో అధికారం ఉంది, చెపితే వినే పోలీసులు ఉన్నారు.. అని మిడిసిపడితే, ఈ అహంకారాన్ని ప్రజలు తీసిపారేస్తారని చెప్పారు.
ఎన్నికలు వస్తున్నప్పుడే ముఖ్యమంత్రికి బీసీ సంక్షేమం, పెన్షన్లు గుర్తుకు వస్తాయన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాలు 15 వేల పైచిలుకు ఉంటే, అందులో అనేకమందికి ఇప్పటికి దళిత బంధు అందలేదన్నారు. మంజూరైన లబ్ధిదారులకు కూడా పూర్తిస్థాయిలో
పది లక్షల మొత్తాన్ని ఇవ్వలేదన్నారు. దళిత బంధు పథకానికి ఎంపిక కావాలంటే ఫైరవీకారులకు రెండు నుండి ఐదు లక్షలు సమర్పించుకోవాల్సి వస్తుందన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అందని ప్రతి కుటుంబానికి దానిని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి బీసీల పట్ల ప్రేమ ఉంటే ఆ సామాజిక వర్గంలోని అన్ని కులాలకు లక్ష రూపాయల సాయం వర్తింపజేయాలని కోరారు. దరఖాస్తుల సమయంలోనే కుల,
ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కోరి బీసీలకు రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు.
లక్ష రూపాయల సహాయం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని, లబ్ధిదారుల ఎంపిక తర్వాత మాత్రమే, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని, ప్రతి ఒక్క బీసీకి ఈ పథకం వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే బీసీ లబ్ధిదారులకు డబ్బు ఇస్తారో, చెల్లని చెక్కులు ఇస్తారో తెలియని దుస్థితి నెలకొందన్నారు.