Karnataka 2023 Opinion Poll | కర్ణాటకలో మార్పు తథ్యమంటున్న సర్వే.. కానీ

హంగ్‌ అసెంబ్లీ దిశగా ఎన్నికల ఫలితాలు అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌కు అవకాశం కింగ్‌ మేకర్‌ పాత్రలో మళ్లీ జేడీ (ఎస్‌) సీఎం పదవిలో కూర్చొనేది సిద్ధరామయ్యే సౌత్‌ ఫస్‌ కర్ణాటక ప్రి-పోల్‌ సర్వేలో వెల్లడి Karnataka 2023 opinion poll । అందరూ ఊహిస్తున్నట్టే కర్ణాటకలో ఈసారి బీజేపీ ఓటమి తథ్యమని ప్రి-పోల్‌ సర్వే ఒకటి తేల్చింది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా వేసింది. ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌కు అవకాశం ఉన్నదని, కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌.. […]

  • Publish Date - April 13, 2023 / 10:34 AM IST
  • హంగ్‌ అసెంబ్లీ దిశగా ఎన్నికల ఫలితాలు
  • అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌కు అవకాశం
  • కింగ్‌ మేకర్‌ పాత్రలో మళ్లీ జేడీ (ఎస్‌)
  • సీఎం పదవిలో కూర్చొనేది సిద్ధరామయ్యే
  • సౌత్‌ ఫస్‌ కర్ణాటక ప్రి-పోల్‌ సర్వేలో వెల్లడి

Karnataka 2023 opinion poll । అందరూ ఊహిస్తున్నట్టే కర్ణాటకలో ఈసారి బీజేపీ ఓటమి తథ్యమని ప్రి-పోల్‌ సర్వే ఒకటి తేల్చింది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా వేసింది. ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌కు అవకాశం ఉన్నదని, కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలనే నిర్ణయించే పాత్రలో ఉంటుందని పేర్కొన్నది. ముఖ్యమంత్రిగా మళ్లీ సిద్ధరామయ్యే ఉంటారని తెలిపింది.

విధాత : కర్ణాటకలో ఎన్నికల వేడి ఒక రేంజ్‌లో ఉన్నది. మే 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మరోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ, ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. తన వంతు సీట్లను తాను తెచ్చుకునే ప్రయత్నాల్లో జేడీఎస్‌ ఉన్నాయి. అయితే.. ఈసారి కర్ణాటకలో అధికార మార్పిడి తథ్యమంటున్నది ఒక సర్వే.

మరో నాలుగు వారాల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో సౌత్‌ ఫస్ట్‌ అనే వెబ్‌సైట్‌.. పీపుల్స్‌ పల్స్‌ అనే సంస్థతో కలిసి అభిప్రాయ సేకరణ నిర్వహించింది. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 10 మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని తేలింది. అదే సమయంలో అధికార మార్పడి తథ్యమని కూడా సర్వే స్పష్టం చేస్తున్నది.

కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని, ఆయనే ఈసారి ముఖ్యమంత్రి అవుతారని కూడా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. హోరా హోరీ పోరు సౌత్‌ ఫస్ట్‌ సంస్థ జనవరి నెలలో ఒక దఫా సర్వే నిర్వహించింది. హోరాహోరీగా సాగే పోరులో కాంగ్రెస్‌ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆనాటి సర్వే పేర్కొన్నది. అదే హోరాహోరీ వాతావరణం ప్రస్తుతం కూడా కొనసాగుతున్నది.

తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్‌ పార్టీయేనని 26శాతం మంది చెప్పగా.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని 24 శాతం మంది పేర్కొన్నారు. 15 శాతం మంది జేడీఎస్‌కు మొగ్గు చూపారు. 31 శాతం మంది ఈ మూడింటిలో ఏ ఒక్కటీ సొంత బలంపై అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. అన్నింటికి మించి.. నాలుగు శాతం మంది తాము ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పారు. ఇప్పడు రెండు జాతీయ పార్టీలకు గుబులు పుట్టిస్తున్న అంశం ఇదే. ఈ నాలుగు శాతం ఓటర్లే ఫలితాలను నిర్ణయించబోతున్నారు.

113 మ్యాజిక్‌ ఫిగర్‌

కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. వీటిలో 113 సీట్లు గెలుచుకునేవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. అయితే.. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌లలో ఏ ఒక్కటీ మెజార్టీ మార్కు దాటే అవకాశం లేదని సర్వే అంచనా వేసింది.

ఎవరికి ఎన్ని?

కాంగ్రెస్‌ 98 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదని అంచనా వేసిన సర్వే.. కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్న సీట్ల రేంజ్‌ను 95 నుంచి 105 మధ్య అని పేర్కొన్నది. అంటే.. కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నమాట. ఇక బీజేపీకి 92 సీట్లు రావచ్చని అంచనా వేస్తూనే.. రేంజ్‌ను మాత్రం 90-100గా తెలిపింది. ఈ రెండు జాతీయ పార్టీలు మునుపటి సర్వేకంటే నువ్వా నేనా? అన్నట్టు పోరాడబోతున్నాయని పేర్కొన్నది.

స్వల్పంగా పెరిగిన కాంగ్రెస్‌ ఓటు షేర్‌

జనవరిలో విడుదలైన పోల్‌ సర్వేల్లో కాంగ్రెస్‌ 101 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉన్నదని వెల్లడైంది. ఇందులో 9 అటూ ఇటూ కావచ్చని అంచనా వేసింది. బీజేపీకి ఏడు సీట్లు అటూఇటూగా 91 స్థానాలు రావచ్చని తెలిపింది.

అప్పటి నుంచి రెండు నెలల తర్వాత కాంగ్రెస్‌ ఓటు షేర్‌ స్వల్పంగా పెరిగింది. ఇక కింగ్‌మేకర్‌గా అవతరించే జేడీఎస్‌ 27 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదన్న సర్వే.. ఆ పార్టీకి 25 నుంచి 30 సీట్లలో విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

రెండు జాతీయ పార్టీలో ఏదీ మెజార్టీ మార్కు దాటలేక, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో జేడీఎస్‌ మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. తగ్గిన జేడీఎస్‌ షేర్ జనవరి నాటి సర్వేలో జేడీఎస్‌కు 29 సీట్లు (5 సీట్లు అటూఇటూగా) వస్తాయన్న సర్వే.. ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో దాని ఓటింగ్‌ షేర్‌ తగ్గిందని పేర్కొన్నది

గాలికి షాకే, ఆప్‌ ప్రభావం ఉండదు

మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌రెడ్డికి సర్వే షాకింగ్‌ న్యూస్‌ ఇచ్చింది. గాలి స్థాపించిన కల్యాణ్‌రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఎంఐఎం, ఎస్‌డీపీఐ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశాలు లేవని, ఇటీవలే జాతీయ హోదా పొందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభావం కూడా ఏమీ ఉండే అవకాశాలు లేవని తెలిపింది.

ఆ నాలుగు శాతం ఓట్లే కీలకం

తమ సర్వేలో నాలుగు శాతం ఓటర్లు వారి అభిప్రాయం చెప్పలేదని సౌత్‌ ఫస్ట్ – పీపుల్స్‌ పల్స్‌ తెలిపింది. ఈ నాలుగు శాతం ఓట్లు ఫలితాన్ని మార్చివేయవచ్చునని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే.. కాంగ్రెస్‌కు 2.86 శాతం ఓట్లు పెరగనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 38.14 శాతం ఓట్లు తెచ్చుకున్నది. అంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటింగ్‌ 41శాతానికి పెరుగుతుంది. దీని ఫలితంగా కాంగ్రెస్‌కు అదనంగా 18 సీట్లు సమకూరుతాయి.

గత ఎన్నికల్లో 36.35 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ.. 0.35 శాతం ఓట్లు తగ్గి.. 36 శాతానికి పరిమితమవుతుందని సర్వే పేర్కొన్నది. జేడీఎస్‌కు రెండు శాతం ఓట్లు తగ్గుతాయి. అంటే.. దాదాపు పది సీట్లు కోల్పోతుంది.

సిద్ధరామయ్యే 32 శాతం మంది చాయిస్‌

ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్న ప్రశ్నకు 32 శాతం మంది కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉండాలన్నారు. యడ్యూరప్ప రావాలని 25శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మైకి 20శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. 18 శాతం మంది కుమారస్వామికి మొగ్గు చూపారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఐదు శాతం మంది మద్దతు మాత్రమే లభించింది.

అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌ రావాలి

అభివృద్ధి విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్‌ బెటరన్న అభిప్రాయం వ్యక్తమైంది. 42 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్‌కే మొగ్గు చూపారు. బీజేపీ పట్ల 38 శాతం, జేడీఎస్‌కు 14 శాతం ఓటేశారు.

ఏర్పడేది కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణమే!

రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణం కొలువుదీరుతుందని 46 శాతం మంది చెప్పారు. బీజేపీతో జేడీఎస్‌ కలుస్తుందని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. 56 నియోజకవర్గాల్లో 5600 శాంపిళ్లను తీసుకుని ఈ సర్వే అంచనాలు రూపొందించారు.