బెంగళూరు: దేశ రాజకీయాలను, రాబోయే ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేయనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ఫలితాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పలు సర్వేలు కర్ణాటక పీఠం కాంగ్రెస్‌దేనని పేర్కొంటున్నాయి. అభిప్రాయ సేకరణల్లో, గ్రౌండ్ రిపోర్టుల్లోనూ ఇదే తేలుతున్నది.
రోజు రోజుకూ కమలం పార్టీ డీలా పడుతున్నదని, కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటున్నదని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. తాజాగా లోక్‌పాల్ సంస్థ నిర్వహించిన సర్వేలో సైతం కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నది. మంగళవారం తన సర్వే ఫలితాలను లోక్‌పాల్ విడుదల చేసింది. మార్చి చివరాంకం వరకు నిర్వహించిన సర్వేలో 128 నుంచి 131 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవనుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి 66 నుంచి 69 స్థానాలు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల (మైసూర్ కర్ణాటకకు)కు పరిమితమైన జేడీఎస్‌కు 21 నుంచి 25 మాత్రమే వచ్చే అవకాశం ఉందని వివరించింది. స్వతంత్ర స్థానాలు రెండు లోపే ఉంటాయని నివేదించింది. మొత్తంగా ఈ సర్వే కోసం లోక్ పాల్ సంస్థ 65 వేల శాంపిల్స్‌ను సేకరించి, విశ్లేషించింది.
జోన్లవారీగా చూసుకుంటే… ఓల్డ్ మైసూర్, బెంగళూరు, కళ్యాణ్ కర్ణాటక, కిత్తూర్ కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మెరుగైన వాతావరణం ఉన్నదని పేర్కొన్నది. కోస్టల్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక ప్రాంతాల్లో కొన్ని సీట్లు తగ్గినట్టు కనిపిస్తున్నది. ఇక బీజేపీకి మాత్రం అన్ని ప్రాంతాల్లో సీట్లు గణనీయంగా తగ్గగా, కేవలం కిత్తూర్ కర్ణాటకలో కొంతమేర ప్రభావం చూపించినట్టు స్పష్టమవుతున్నది.
ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్‌లో భాగమైన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ బలం పెంచుకున్నదని సర్వేలో తేలినట్టు తెలిసింది. ఆ ప్రాంతాన్ని బీజేపీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష్యుడిని చేసి, పార్టీ ఆలిండియా స్థాయిలో సముచిత స్థానం కల్పించడం హస్తం పార్టీకి కలిసి వచ్చే అంశాలని అంటున్నారు.
దాంతోపాటు, లింగాయత్ కమ్యూనిటీ అంతా బీజేపీ రాజకీయ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆ సామాజికవర్గానికి చెందిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చుతున్నది. అయితే, మార్చి వరకు తీసిన సర్వే శాంపిల్స్‌లో ఈ అంశాలు వెల్లడైతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా తయారయ్యాయన్న విషయం తెలిసిందే.