22న ధర్నాకు అనుమతినివ్వండి.. సీఈవోకు కర్ణాటక రాజ్య రైతు సంఘం విన్నపం

22న ధర్నాకు అనుమతినివ్వండి.. సీఈవోకు కర్ణాటక రాజ్య రైతు సంఘం విన్నపం

విధాత : కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు కావడం లేదని, తమకు ఇస్తామన్న కరెంటు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్క్ వద్ద తాము తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వాలని సీఈఓ వికాస్ రాజ్‌ కి కర్ణాటక రాజ్య రైతు సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమవారం కర్ణాటక రాజ్య రైతు సంఘం సభ్యులు హైదరాబాద్ సీఈవో కార్యాలయానికి వెళ్లి వికాస్ రాజ్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాజ్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడిహలి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని జాతీయ పార్టీలు రైతులకు బోగస్ హామీలు ఇస్తున్నందుకు నిరసనగా ధర్నాకు సిద్ధమైనట్లుగా తెలిపారు.


దేశంలో ఉన్న జాతీయ పార్టీలు రైతులచే తిరస్కరించబడ్డాయని, రైతులకు ఎంఎస్‌పీ కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు విఫలం అయ్యాయన్నారు. రైతులకు ఇచ్చే హామీలను జాతీయ పార్టీలు అమలు చేయడం లేదని, ఇప్పటికే కర్ణాటకలో రైతులు అందరూ జాతీయ పార్టీల వల్ల మోసపోయామన్నారు. తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఇక్కడి రైతులకు అవగాహన కల్పించడానికి ధర్నా చేస్తామన్నారు. ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా కోసం సీఈఓ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను అనుమతి అడిగామని వెల్లడించారు.