Karnataka | సిద్ధరామయ్యే కర్ణాటక సీఎం.. రేపు ప్రమాణ స్వీకారం.. తేల్చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం!
క్యాబినెట్‌లో చేరబోనన్న డీకే శివకుమార్ సోనియా సూచనను వినమ్రంగా తిరస్కరించిన నేత డిప్యూటీ రేసులో పాటిల్, పరమేశ్వర, ఖాదర్! రేపు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం.. సాయంత్రానికి వెలువడనున్న అధికారిక ప్రకటన. విధాత: హస్తినలో తీవ్ర తర్జనభర్జనలు, సుదీర్ఘ మంతనాల అనంతరం కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సీనియర్ నేత సిద్ధరామయ్యనే సీఎం పోస్టు వరించనున్నదని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ఎలాంటి ఫార్ములాలనూ అంగీకరించేది లేదని, ముఖ్యమంత్రి పదవి పంచుకోవడానికి పూర్వీకుల ఆస్తి […]

- క్యాబినెట్‌లో చేరబోనన్న డీకే శివకుమార్
- సోనియా సూచనను వినమ్రంగా తిరస్కరించిన నేత
- డిప్యూటీ రేసులో పాటిల్, పరమేశ్వర, ఖాదర్!
- రేపు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం..
- సాయంత్రానికి వెలువడనున్న అధికారిక ప్రకటన.
విధాత: హస్తినలో తీవ్ర తర్జనభర్జనలు, సుదీర్ఘ మంతనాల అనంతరం కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సీనియర్ నేత సిద్ధరామయ్యనే సీఎం పోస్టు వరించనున్నదని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి.
ఎలాంటి ఫార్ములాలనూ అంగీకరించేది లేదని, ముఖ్యమంత్రి పదవి పంచుకోవడానికి పూర్వీకుల ఆస్తి కాదన్న డీకే శివకుమార్ తన వాదనకు కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు. దీంతో సీఎం పదవీ కాలాన్ని సిద్ధరామయ్య, డీకే మధ్య పంపిణీ చేద్దామనుకున్న అధిష్ఠానం ఆ ప్రయత్నాలను విరమించుకున్నదని సమాచారం.
అయితే.. సిద్దరామయ్య క్యాబినెట్‌లో చేరేందుకు కూడా డీకే సిద్ధ పడలేదని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జరిపిన సంప్రదింపుల్లో ఎలాంటి ఫలితం తేలకపోవడంతో మరో దఫా చర్చల కోసం సిద్ధరామయ్య, డీకే ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు.
సీఎం లేదంటే ఎమ్మెల్యేగానే
తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, డిప్యూటీ సీఎం పదవి అక్కర్లేదని కరాఖండితంగా చెప్పిన డీకే.. సీఎం పోస్టు కాకపోతే.. ఎమ్మెల్యేగానే ఉండిపోతానని ఖర్గేకు తెలిపారని సమాచారం. డిప్యూటీ సీఎం పదవి స్వీకరించాలని పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా డీకేతో మాట్లాడారని, అయితే.. ఆమె సూచనను డీకే సున్నితంగా తిరస్కరించారని సమాచారం. దీంతో కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరారని తెలిసింది.
డిప్యూటీ రేసులో ముగ్గురు
డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా ఉండేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రులుగా ఎవరిని పెట్టాలనే చర్చ కూడా సాగుతున్నది. ముగ్గురు సీనియర్ నేతలు ఎంబీ పాటిల్, జీ పరమేశ్వర, యూటీ ఖాదర్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిలో పాటిల్ లింగాయత్‌లకు చెందినవారు కాగా.. పరమేశ్వర ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఖాదర్‌ను ఎంపిక చేస్తే మైనార్టీలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు.
పాటిల్ గతంలో హోం, జల వనరుల శాఖల మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ 2013-18లో అధికారంలో ఉన్న కాలంలో లింగాయత్‌లను మైనార్టీల్లో చేర్చాలని సాగిన ఉద్యమానికి నేతృత్వం వహించారు. తాజా ఎన్నికల్లో పార్టీ ప్రచార కమిటీకి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పోస్టుకు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో తాను సైతం అంటూ కేపీసీసీ మాజీ అధ్యక్షుడు పరమేశ్వర సంకేతాలు ఇచ్చారు. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీలో పార్టీ ఉప నేతగా ఖాదర్ ఉన్నారు. మంగళూరు నుంచి ఐదు దఫాలు ప్రాతినిథ్యం వహించారు.
మరోవైపు సిద్ధరామయ్యతో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమావేశం ముగిసింది. దాదాపు 30 నిమిషాలపాటు వారి సమావేశం కొనసాగింది. కర్ణాటకలో సిద్ధరామయ్య ఇంటి వద్ద భద్రత పెంపు కూడా ఆయనే కాబోయే సీఎం అనే సంకేతాలు ఇస్తున్నది. సిద్ధరామయ్య గురువారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆయన ఒక్కరే ప్రమాణం చేస్తారని సమాచారం