లోక్‌సభ బరిలో బీఆరెస్‌ బాస్!

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని, వస్తే ఆయనను కూర్చోబెట్టి వారి పాలనా వైఫల్యాలను వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకుంటున్నారు.

  • Publish Date - March 14, 2024 / 10:06 AM IST
  • అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇష్టం లేకే!
  • మెదక్‌ నుంచి పార్లమెంటుకు వెళ్లే చాన్స్‌
  • కాలం కలిసొస్తే.. ఎన్డీయేలో చేరిక
  • బీజేపీ తరఫున బీఆరెస్‌ పాతకాపులు
  • బీజేపీతో అవగాహనతోనే అభ్యర్థుల ప్రకటన?


విధాత: కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని, వస్తే ఆయనను కూర్చోబెట్టి వారి పాలనా వైఫల్యాలను వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వస్తారా? బీఆరెస్‌ పక్ష నేతగా కొనసాగుతారా? కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతారా? లేదా ఈటల రాజేందర్‌ మొహం అసెంబ్లీలో కనిపించొద్దని శపథం చేసి.. చివరకు భంగపడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తానే అసెంబ్లీకి దూరమవుతారా? అదే అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేస్తారా? అనే చర్చలు చాలా కాలం నుంచీ ఉన్నాయి.


అయితే ఆయన వ్యవహారశైలిని, ఆయన ఆలోచనలను, ఆయన వ్యూహాలను అంచనా వేస్తున్నవాళ్లు, ఆయనను దగ్గరగా చూసినవాళ్లు కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయడం ఖాయమంటున్నారు. బీఆరెస్‌ కంచుకోటగా ఉన్న మెదక్‌ స్థానంపై బీజేపీ, కాంగ్రెస్‌ కన్నేశాయి. ఇక్కడ కూడా బీఆరెస్‌ను ఓడగొడితే కేసీఆర్‌ను నైతికంగా దెబ్బకొట్టినట్టు అవుతుందని రెండు పార్టీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. మరోవైపు అక్కడ కేసీఆర్‌ నిలబడితే తప్ప బీఆరెస్‌ విజయం అంత తేలిక కాదని పార్టీ శ్రేణుల వాదన.


కాలం కలిసొస్తే.. ఎన్డీఏలోకి?


కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తనకు రాజకీయంగా ఇబ్బంది అన్నది ఆయనకు తెలుసు. అందుకే ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలు, అవసరాలను బట్టి బీఆర్‌ఎస్‌ ఎన్డీఏలో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన మళ్లీ రాష్ట్రంలో తన పార్టీని, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తప్పకుండా యత్నిస్తారని, అందుకోసం ఎన్నికల అనంతరం ఆయన అడుగులు ఎన్డీఏ వైపే పడే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు.


దీనికి బలం చేకూర్చే విధంగానే బీజేపీ రాష్ట్రంలో ప్రకటించిన లోక్‌సభ స్థానాల్లో మహబూబాబాద్‌, జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, మల్కాజిగిరి, మెదక్‌, పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండ, మేడ్చల్‌ అభ్యర్థులంతా బీఆరెస్‌లో నిన్నమొన్నటిదాకా కొనసాగినవారే కావడం గమనార్హం. ఈటల రాజేందర్‌, రఘునందన్‌ లాంటి వారు బీఆరెస్‌ అధినేతతో ఉద్యమకాలం మొదలు చాలా ఏళ్లు కలిసి నడిచినవాళ్లే అని గుర్తు చేస్తున్నారు.


అవగాహన మేరకే అభ్యర్థుల ప్రకటన?


బీఆరెస్‌, బీజేపీ మధ్య అవగాహన మేరకే రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటన అని, ఇరు పార్టీల ఏకైక లక్ష్యం కాంగ్రెస్‌ను నిలువరించడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ప్రస్తుత బీఆరెస్‌ పార్టీలో సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ఉద్యమకాలంలోనూ, ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఆరుగురు మంత్రులు ప్రభుత్వం ఉన్నరోజుల్లోనూ ఇలాంటి సంక్షోభాలు ఎదురయ్యాయని, కానీ ఆయన ఈ విషయంలో కొన్నిసార్లు విఫలమైనా చాలాసార్లు విజయవంతమయ్యారని చెబుతున్నారు.


బీజేపీకి కూడా రాజకీయ అవసరాలున్నాయి. ఏపీలో టీడీపీని కలుపుకొన్నది. ఒడిశాలో జేడీఎస్‌ను కలుపుకోవడానికి యత్నించి విఫలమైంది. ఇంకా అటు ఇండియా లేదా ఎన్డీఏ కూటమిలో లేని బీఆరెస్‌, బీఎస్పీ లాంటి పార్టీలను ఎన్నికల అనంతరం ప్రభుత్వంలోకి ఆహ్వానించినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు.


కడియంకు శాసనసభాపక్ష పగ్గాలు?


ఒకవేళ కేసీఆర్‌ పార్లమెంటుకు వెళ్తే బీఆరెస్‌ కొత్తగా బీఆరెస్‌ఎల్పీ నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో కేటీఆర్‌, హరీశ్‌ మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది. కానీ వారిద్దరి మధ్య పోటీ పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిని బీఆరెస్‌ఎల్పీ నేతగా ఎన్నుకునేందుకు అవకాశం ఉన్నదనే చర్చ నడుస్తున్నది.


రేవంత్‌కు ఎదురుపడలేకే?


అసెంబ్లీలో రేవంత్‌కు ఎదురుపడటం, ఆయనతో చర్చలో పాల్గొనడం కేసీఆర్‌కు ఇష్టం ఉండకపోవచ్చని, అందుకే ఆయన మెదక్‌ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా కేసీఆర్‌ మెదక్‌ ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నారు. ఆయన పోటీలో ఉంటే ఆ స్థానానికి పెద్దగా కష్టపడకుండానే గెలుచుకోవచ్చని వారి అభిప్రాయం. కేసీఆర్‌ లోక్‌సభకు పోటీ చేస్తారా? అసెంబ్లీ లో బీఆరెస్‌ పక్ష నేతగా ఉంటారా? అన్నది మూడు నాలుగు రోజుల్లో తేలనున్నది.