KCR
విధాత: ‘సంక్షేమంలో మనం దేశానికి ఆదర్శం.. పాలనలో ఇతర రాష్ట్రాలకు అనుసరణీయం’ అని సీఎం కేసీఆర్ ( KCR ) మొదలుకుని.. కిందిస్థాయి నేతల వరకు ఇదే లైన్ మీద మాట్లాడుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నది వాస్తవం. ప్రభుత్వం కూడా వీటికి ఇతోధికంగా నిధులు కేటాయిస్తూ అమలు చేస్తున్నది. ఇక్కడివరకు బాగానే ఉన్నది.
కానీ ఆ పథకాల లబ్ధిదారులు అధికార పార్టీ వైపే ఉంటారన్న నమ్మకం అధికారపార్టీ నేతల్లో ఉన్నట్టు లేదు. పథకాల కంటే విపక్ష పార్టీల నేతలను ప్రలోభపరుచుకునే ప్రయత్నం చేయడం.. లేకపోతే రాజకీయ పునరేకీకరణ పేరుతో పార్టీలను అధికార పార్టీలో కలుపుకోవడం తొమ్మిదేళ్లుగా చూస్తున్నాం.
ఒకప్పుడు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటే గంట ముందుగానే మీడియాలో, యూట్యూబ్ చానళ్లలో హడావుడి మొదలయ్యేది. ఆయన వాగ్ధాటి నుంచి వచ్చే పంచ్‌లు బ్రేకింగ్ అయ్యేవి. అవే బ్యానర్ హెడ్డింగ్స్ అయ్యేవి అంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాటల్లో వాడి తగ్గింది. ప్రజలు కూడా ఆయన ప్రెస్‌మీట్‌లను, బహిరంగ సభల్లో ఆయన స్పీచ్‌లను వినడానికి పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే చెప్పిందే చెప్పి బోర్ కొట్టిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
దేశ్ కీ నేత కావాలనుకుంటున్న కేసీఆర్ ఆలోచనలకు, ఆయన మాటలకు, ఆచరణలకు ఎక్కడా పొంతన కుదరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని పథకాల పేర్లు చెప్పి అవి దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా? అని ప్రశ్నిస్తున్న వారు మరి ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఎందుకు ఆలస్యమౌతున్నాయో కూడా సమాధానం స్పష్టంగా చెబితే బాగుంటుందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
పదో తేదీ వచ్చినా కొన్ని జిల్లాల్లో ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదని సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పెడుతున్నారు. ఇలా అనేక అంశాలు కారణం కావొచ్చు. జనంలో కేసీఆర్ అంటే ఒకప్పటి క్రేజ్ ప్రస్తుతం తగ్గింది. ఆయన ప్రెస్‌మీట్‌లను లైవ్‌లో చూసే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు.
అంతేకాదు ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. ఏపీకి మనకు పొంతనే లేదని, అభివృద్ధిలో ఆ రాష్ట్రం తెలంగాణ దరిదాపుల్లో లేదన్న బీఆర్‌ఎస్ అధినేత ఈ మధ్య కాలంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ భావోద్వేగాలు పెంచే ప్రయత్నమే ఇది అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
అయితే నాటి ఎమోషన్స్ ఇప్పుడు లేవని.. దీనికి కారణం గత తొమ్మిదేళ్ల కాలంలో మొదటి మూడేళ్ల తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని, సోయిని ప్రచారంలో లేకుండా ఇతర అంశాలను తెరమీదికి తెచ్చింది అధికార పార్టీ నేతలే అని అంటున్నారు. తమ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు తెలంగాణ గురించి ఎంత చెప్పినా దాన్ని సీరియస్‌గా తీసుకుని ఓట్లు వేసే పరిస్థితి లేదంటున్నారు.
ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలు తమ ఆకాంక్షలు ఎంత వరకు నెరవేరాయి? తమ నియోజకవర్గం ఆశించిన అభివృద్ధి చెందిందా? తమ ఎమ్మెల్యే, ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? తమ సమస్యలు పరిష్కారమయ్యాయా? వంటి అంశాలే వచ్చే ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నట్టు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.