సీఎం రేవంత్‌రెడ్డివి పిల్ల చేష్టలు..సభను ఎవరు అడ్డుకుంటారో చూస్తా

కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు

సీఎం రేవంత్‌రెడ్డివి పిల్ల చేష్టలు..సభను ఎవరు అడ్డుకుంటారో చూస్తా
  • సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహాన లేదు
  • రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితోనే నది జలాల హక్కుల ఉద్యమం
  • ఈనెల 13న నల్లగొండలో బహిరంగ సభ
  • బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌


విధాత : కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ…కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈనెల 13 న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆరెస్‌ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.


కృష్ణా నదిపై ఉన్న‌ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తలెత్తే నష్టాలు పర్యవసానాలు పై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నాడు రాష్ట్ర సాధన ఉద్యమం నడిపించి తెలంగాణ ను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు నది జలాల హక్కుల పరిరక్షణకు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత బీఆరెస్‌ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందన్నారు.


తాగు, సాగునీటికి కష్టాలు వస్తాయి

బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కులకోసం పోరాడడమే కాకుండా “మా నీళ్లు మాకే “ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలం లోనే నిజం చేసి చూయించిన ఘనత బీఆరెస్‌ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బీఆరెస్‌ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు.


కేంద్ర పెత్తనంతో మనం నీళ్లను అడుక్కోవాల్సిందే

కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని, ప్రాజెక్టులను బోర్డుకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కోవాల్సి వస్తుందన్నారు. అందుకే తమ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణ కు రావలసిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనన్నారు. ఈ మేరకు ఈ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.


ఈ సమావేశం లో బీఆరెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పి చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు…తదితరులు భారీగా పాల్గొన్నారు.

పాలన చేతగాక నాపై విమర్శలు

మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం పిల్ల చేష్టలను తలపిస్తున్నదని, పాలన చేతకాక తనపై కారుకూతలు కూస్తున్నాడని కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీటి సమస్యలపై నల్లగొండలో సభ పెడుదామంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడ్డుకుంటామని అంటున్నారన్న కేసీఆర్‌.. తాము సభ పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఆయనెవరని ప్రశ్నించారు. బీఆరెస్‌ సభను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుల మీద బీఆరెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కొట్లాడుతారని, ప్రజాక్షేత్రంలో నల్లగొండలో నేతలతో వెళ్లి కొట్లాడుదామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని.. వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారన్నారు. ఎన్నికల్లో సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని కేసీఆర్ హెచ్చరించారు.