కేసీఆర్ మాజీ సీఎం కాద‌ట‌..? బీఆర్ఎస్ ట్వీట్‌పై నెటిజ‌న్ల చ‌ర్చ‌

ప్ర‌జాప్ర‌తినిధులు అధికారం కోల్పోయినా, త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి వారు వెంట‌నే మాజీలు అయిపోతారు.

  • By: Somu    latest    Dec 12, 2023 10:55 AM IST
కేసీఆర్ మాజీ సీఎం కాద‌ట‌..? బీఆర్ఎస్ ట్వీట్‌పై నెటిజ‌న్ల చ‌ర్చ‌

విధాత‌: ప్ర‌జాప్ర‌తినిధులు అధికారం కోల్పోయినా, త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి వారు వెంట‌నే మాజీలు అయిపోతారు. మాజీ స‌ర్పంచ్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ముఖ్య‌మంత్రి అని పిలుస్తారు. మీడియాతో పాటు ఇత‌రులు కూడా మాజీ సీఎం అని పిలుస్తారు. రాస్తారు కూడా.


కానీ కేసీఆర్ విష‌యంలో మాత్రం అందుకు విరుద్ధంగా జ‌రుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ అని పిల‌వ‌కూడ‌ద‌ని పార్టీ అగ్ర నాయ‌క‌త్వం ఆదేశించిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు ఆ పార్టీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో కూడా మాజీ సీఎం అని రాయ‌డం లేదు. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి అని రాస్తున్నారు. ఇప్పుడు అది కాస్త వివాదాస్ప‌ద‌మైంది.


ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. నిన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. కేసీఆర్‌ను య‌శోద ఆస్ప‌త్రిలో ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.


అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ప‌దేండ్లు అధికారం అనుభ‌వించిన బీఆర్ఎస్ నేత‌లు, అధికారానికి దూర‌మై ప‌ది రోజులు కూడా కాక‌ముందే, త‌మ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నారా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. కేసీఆర్ తొలి ముఖ్య‌మంత్రి అవుతాడు కానీ చంద్ర‌బాబు మాజీ సీఎం అవుతాడా..? ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి తొలి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే క‌దా..? అలాంట‌ప్పుడు బాబును కూడా ఏపీ తొలి సీఎం అని సంబోధించొచ్చు క‌దా..? అని నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


కేసీఆర్‌ను మాజీ సీఎం అని పిల‌వ‌లేరా? అని అడుగుతున్నారు. అధికారం కోల్పోయాక మాజీ అని అంతా ఒప్పుకోవాల్సిందే. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటమి, అధికారాన్ని కోల్పోయామని నిజాన్ని అంగీకరించటం చాలా కష్టంగా మారింది. అంతేకాదు.. కేసీఆర్ యాజ‌మాన్యంలో న‌డుస్తున్న ఓ దిన‌ప‌త్రిక‌లో కూడా మాజీ సీఎం కేసీఆర్ అని రాయ‌కూడ‌ద‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. కేవ‌లం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని మాత్ర‌మే రాయాల‌ని ఆ ప‌త్రిక ఉద్యోగుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.