విధాత : తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆరెస్ ఎంపీలపైనే ఉన్నాయని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆరెస్ మాత్రమేనని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆరెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై ఎంపీలకు, నియోజకవర్గం ఇంచార్జీలకు, ముఖ్య నాయకులకు మార్గదర్శకం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో బీఆరెస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని నిర్ధేశించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో బీఆరెస్ గళం బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఉభయ సభల్లో బలంగా ప్రశ్నించాలన్నారు. ముఖ్యంగా కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టమన్నారు. ఆపరేషన్ మ్యానువల్, ప్రొటోకాల్ లేకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించాలని వారికి సూచించారు. రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బిఆరెస్ పార్టీదేనన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆరెస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, బీఆరెస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒంటరిగానే గట్టిగా పోరాడుదామని, త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కె. కేశవరావు, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు ఎంపీలు రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డిలు పాల్గొన్నారు.