అత్త‌ను తోసేసి.. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన కోడ‌లు.. వైర‌ల‌వుతున్న వీడియో

వృద్ధురాలైన అత్త‌ను కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సింది పోయి.. ఆమె ప‌ట్ల క‌ర్క‌శ‌కంగా ప్ర‌వ‌ర్తించింది ఓ కోడలుఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని అత్త‌ను హింసించింది

అత్త‌ను తోసేసి.. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన కోడ‌లు.. వైర‌ల‌వుతున్న వీడియో

తిరువ‌నంత‌పురం : వృద్ధురాలైన అత్త‌ను కంటికి రెప్ప‌లా చూసుకోవాల్సింది పోయి.. ఆమె ప‌ట్ల క‌ర్క‌శ‌కంగా ప్ర‌వ‌ర్తించింది ఓ కోడలు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని అత్త‌ను హింసించింది. ఇంట్లో మంచ‌పై కూర్చున్న అత్త‌ను నేల‌పైకి తోసేసింది. ఆ త‌ర్వాత అస‌భ్య‌క‌రంగా మాట్లాడింది కోడ‌లు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.


వివ‌రాల్లోకి వెళ్తే.. కేర‌ళ‌లోని కొల్లాం జిల్లాకు చెందిన ఓ కోడ‌లు త‌న అత్త‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. అత్త‌గా నెమ్మ‌దిగా నడుచుకుంటూ వచ్చి హాల్‌లో మంచంపై కూర్చుంది. అప్ప‌టికే ఆగ్ర‌హాంతో ఉన్న కోడ‌లు.. అత్త వ‌ద్ద‌కు వ‌చ్చింది. మంచంపై నుంచి లేచిపోవాల‌ని అత్త‌తో రుస‌రుస‌లాడింది. అత్త అక్క‌డే కూర్చోవ‌డంతో.. కోడ‌లు త‌న ప్ర‌తాపం చూపించింది. మంచంపై కూర్చున్న అత్త‌ను నేల‌పైకి తోసేసింది. దీంతో ఆ వృద్ధురాలు మ‌రో గ‌డ‌ప‌పై ప‌డింది. మోకాళ్ల‌కు గాయం కావ‌డంతో అత్త బోరున విల‌పించింది. ఆ త‌ర్వాత లేచి అత్త మ‌రో గ‌దిలోకి వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించాడు. అయితే అత‌ను ఆ వృద్ధురాలి కుమారుడా..? ఇంకెవరైనానా అనే విషయం తెలియ‌రాలేదు.


ఈ వీడియోను సామాజిక ఉద్య‌మ‌కారిణి దీపికా నారాయణ్‌ భరద్వాజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. సమాజంలో వృద్ధులపై హింస పెరుగుతున్నదంటూ ఆమె తను షేర్‌ చేసిన వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. అత్తను కొట్టిన మహిళను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ పోస్టును కేరళ పోలీసులకు ట్యాగ్‌ చేశారు. దాంతో కేరళ పోలీసులు గురువారం రాత్రి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి తీరుపై నెటిజన్‌లు కూడా మండిపడుతున్నారు