కారు పార్టీకి కేకే షాక్‌.. కాంగ్రెస్‌లో చేరనున్న బీఆరెస్‌ సెక్రటరీ జనరల్‌

కొద్దికాలంగా పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. బీఆరెస్‌కు ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు గుడ్‌బై చెప్పారు

  • Publish Date - March 28, 2024 / 03:35 PM IST
  • ఆయన బాటలోనే మాజీ మంత్రి ఐకే రెడ్డి
  • ౩౦న కాంగ్రెస్‌లో చేరనున్న విజయలక్ష్మి
  • పదిమంది కార్పొరేటర్లు కూడా?
  • 84 ఏళ్ల వయసులో సొంతపార్టీలోకి
  • ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే
  • బీఆరెస్‌లో పదవులు, ప్రాధాన్యం ఇచ్చా
  • అయినా పార్టీ నుంచి వెళ్లిపోతారా?
  • అసహనం వ్యక్తం చేసిన గులాబీ బాస్‌
  • సాకులు చెప్పొద్దంటూ కటువు వ్యాఖ్య
  • భేటీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన కేకే?
  • తెలంగాణ కోసమే బీఆర్ఎస్‌లో చేరా
  • కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చింది
  • పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే
  • ఆ పార్టీలోనే చనిపోవాలని ఉంది
  • కేశవరావు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్‌ నుంచి ఇంకా కోలుకోని బీఆరెస్‌కు ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మరో షాక్‌ ఇచ్చారు. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంతగూటికి వెళ్లబోతున్నట్టు ప్రకటించారు. తనతోపాటు మాజీ మంత్రి ఇందకరణ్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వెల్లడించారు. కేశవరావు తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావును తన కుమార్తె గద్వాల్‌ విజయలక్ష్మిని వెంటబెట్టుకుని వెళ్లి కేకే కలిశారు. కేసీఆర్‌తో చర్చించిన అనంతరం తన నివాసానికి చేరుకున్న కేకే మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లు బీఆరెస్‌లో కార్యకర్తలు, నాయకులు చాలా బాగా సహకరించారని చెప్పారు. ఈ పదేళ్లు కేసీఆర్‌ తనకు చాలా గౌరవం ఇచ్చారని కేకే తెలిపారు. తనకు కూడా కేసీఆర్‌పై ఎంతో గౌరవం ఉన్నదని చెప్పారు. ఈ భేటీలో పార్టీ అంతర్గత అంశాలపై చర్చించామని వెల్లడించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం కూడా చర్చకు వచ్చిందని కేకే తెలిపారు. కవితను అక్రమంగా అరెస్టు చేశారని కేకే విమర్శించారు. ఈ నెల 30న తాను, తన తండ్రి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి చెప్పారు. అధికార పార్టీలో ఉంటేనే ప‌నులు జ‌రుగుతాయ‌ని అన్నారు. హైద‌రాబాద్ అభివృద్ధి కోస‌మే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆమె స్పష్టం చేశారు.


తీర్థయాత్రలకు వెళ్లినవారు తిరిగి ఇంటికే వస్తారు

కాంగ్రెస్‌ పార్టీ తన సొంతిల్లన్న కేకే.. తీర్థ యాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్‌లోకే వెళుతున్నానని చెప్పారు. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశానని, బీఆర్ఎస్‌లో పని చేసింది పదేళ్లు మాత్రమేనని అన్నారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్‌లో చేరానని, కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. తాను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్య ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని గుర్తు చేశారు. తాను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనేనని, ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నానని కేకే చెప్పారు. తాను ఇంకా బీఆరెస్‌కు రాజీనామా చేయలేదని తెలిపారు. తన కూతురు కాంగ్రెస్‌లో చేరిన రోజు తాను చేరడం లేదని, ఏ తేదీన చేరేది తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు. తన కుమారుడు మాత్రం బీఆరెస్‌లోనే కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు.


ప్రాధాన్యం, పదవులు ఇచ్చినా ఎందుకు వెళ్లిపోతున్నారు?

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో తనను కలిసిన కేకేపై బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యం, పదవులను ఇచ్చినప్పటికీ ఎందుకు పార్టీ వీడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ సందర్భంగా కేకే తాజా రాజకీయ పరిస్థితులు, తన కూతురు మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మి సహా తన పార్టీ మార్పుపై చోటుచేసుకున్న ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. కేసీఆర్‌ మధ్యలో కల్పించుకుని సాకులు చెప్పవద్దని కటువుగానే చెప్పారని తెలిసింది. పదేళ్ల పాటు పదవులు అనుభవించి అధికారం పోగానే పార్టీ మారుతున్నారంటూ బీఆరెస్ నేతల తీరుపై కేసీఆర్ అసహనం వెళ్లగక్కారని సమాచారం. పార్టీలు మారే వారిని ప్రజలు గమనిస్తారని, మీ ఆలోచన సరైంది కాదంటూ కేకేతో అన్నారని తెలిసింది. కేసీఆర్ మాటలకు తగ్గని కేకే.. తాను, తన కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తేల్చి చెప్పి, సమావేశం మధ్యలోనే ఫామ్‌హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.


కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీ కేకే ఇంటికి వచ్చి ఆయనతో పాటు విజయలక్ష్మితో భేటీ అయ్యారు. దీంతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్నది. బీఆరెస్ కుటుంబ పార్టీగా మారిందని, అన్ని అనర్థాలకు అదే కారణమైందన్నట్లుగా కేకే ఇటీవల ఓ ఇంటర్య్వూలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేకే, కేసీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురి మధ్య సాగిన చర్చలు వారి మధ్య మరింత దూరాన్ని పెంచేశాయని తెలుస్తోంది. కేకే, గద్వాల్‌ విజయలక్ష్మితోపాటు.. మరో పది మంది హైదరాబాద్‌ సిటీ కార్పొరేటర్లు సైతం ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం జరిగినా.. కేకే మాత్రం తాను విడిగా మరొక రోజు పార్టీలో చేరబోతున్నట్టు చెప్పారు. మరోవైపు కేకే కలిసిన సందర్భంలోనే రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా కేసీఆర్‌ను కలిశారు. ప్రకాశ్‌గౌడ్ బీఆరెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన తొలి ఎమ్మెల్యే. తన పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు ప్రకాశ్‌గౌడ్‌ వివరణ ఇచ్చారని తెలుస్తున్నది.


బీఆరెస్‌కు కలిసిరాని నంబర్‌ టూ

బీఆరెస్‌కు నంబర్‌ టూ నేతలు.. ప్రత్యేకించి సెక్రటరీ జనరల్స్‌ అచ్చివచ్చినట్టు లేదు. గతంలో కేసీఆర్‌ తర్వాత నంబర్‌ టూగా చెలామణి అయిన అలె నరేంద్ర, విజయశాంతి పార్టీ సెక్రటరీ జనరల్‌ పదవులు నిర్వహించారు. ఇప్పుడు కేకే కూడా పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. రెండుసార్లు కేకేకు రాజ్యసభ సభ్యత్వం బీఆరెస్‌లో లభించింది. ఆయన కుమార్తెకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం దక్కింది. కుమారుడికి కార్పొరేషన్‌ పదవి కూడా బీఆరెస్‌ హయాలో లభించింది. అయినా.. కాంగ్రెస్‌లోనే చేరుతానని కేకే ప్రకటించడం విశేషం.