Kodela Shivaram |
విధాత: పులి బిడ్డను.. పులి వెంట నడిచిన వాడిని.. ఇప్పుడు పిల్లుల వెంట నడవాలని సూచిస్తున్నారు. అదెలా సాధ్యం.. పదవుల కోసం పార్టీలు మారిన వాళ్లతో రాజకీయాలు ఎలా చేస్తారు. అంటూ దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం పార్టీ అధిష్టానం మీద బాణాలు ఎక్కుబెడుతున్నారు.
తన తండ్రి కోడెల శివప్రసాద్‌రావు గెలిచిన సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్‌ను చంద్రబాబు తనకే ఇస్తారని శివరాం ఆశించారు. అయితే కోడెల శివరాం తీరు మీద సమాజంలో నెగెటివ్ టాక్ ఉండడం, తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారని అందుకే 2019లో కోడెల ఓడిపోయారనే కోపం చంద్రబాబులో ఉంది.
ఆ తర్వాత కోడెల శివప్రసాద్‌రావుకు కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అప్పట్లో అనుకున్నారు.. అంతేకాకుండా శివరాం అరాచకాల మీద పోలీసు కేసు అవ్వడం.. ఇవన్నీ చూడలేక ఆ అవమానంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటారు. ఇక కోడెల మరణం తరువాత కుమారుడు శివరాం సత్తెనపల్లి టికెట్ ఆశిస్తూ ఉన్నారు.
అయితే చంద్రబాబు మాత్రం బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీన్ని కోడెల శివరాం జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగేళ్లుగా అడుగుతున్నా చంద్రబాబునాయుడు కనీసం మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదంటూ శివరాం రగిలిపోతున్నారు.
ఏ నాయకుడికి వ్యతిరేకంగా కోడెల పోరాడారో, ఇప్పుడే అదే వ్యక్తికి తన తండ్రి సీటు ఎలా ఇస్తారని శివరాం ఆగ్రహం. తనను ఒంటరివాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పదవులు, అధికారం కోసం పార్టీలు మారే కుటుంబం తమది కాదని ఆయన అన్నారు.
కోడెల శివప్రసాదరావు స్థానంలో మరొకరిని తీసుకొచ్చి, వారి వెంట నడవాలని తనకు సూచించారని అన్నారు. పల్నాటి పులి కోడెలతో నడిచిన తాను పిల్లుల పక్కన నడిచేది లేదంటూ సంచలన వ్యాఖ్య చేశారు. ఇదిప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది.