విధాత బ్యూరో, కరీంనగర్: రౌడీ మూకల చేష్టలతో మానకొండూర్ (Manakondur) ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రౌడీషీటర్ ను తుపాకీతో కాల్చి అంతమొందించాలని ముగ్గురు రౌడీలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.బీరు సీసాలు, రాళ్ళ దాడిలో గాయపడిన రౌడీషీటర్ వారి వద్ద నుంచి కనురెప్ప పాటులో తప్పించుకున్నాడు. అర్థరాత్రి రౌడీ మూకల చేష్టలతో మానకొండూర్ కాలనీ వాసులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు,కుటుంబ సభ్యులు,స్థానికుల వివరాల మేరకు…మానకొండూర్ మండల కేంద్రంలోని గొల్లవాడకు చెందిన బాషబోయిన అరుణ్ యాదవ్ పై రౌడీషీట్ ఉంది.గతంలో అరుణ్ పై అప్పటి కరీంనగర్ సిపి సత్యనారాయణ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పటి నుంచి అరుణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.బుధవారం రాత్రి అరుణ్ తన ఇంటి సమీపంలో తన స్నేహితులతో మద్యం తాగుతున్నాడు.అర్థరాత్రి ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అరుణ్ వద్దకు వచ్చారు. వారిలో ఒకరు అరుణ్ ను ఆలింగనం చేసుకోగా,మరో వ్యక్తి అరుణ్ పై బీరు సీసాతో దాడికి దిగాడు. మరో వ్యక్తి కూడా అరుణ్ తలపై,శరీర బాగాలపై రాళ్లు,పాల క్యాన్ తో కొట్టాడు.
ముగ్గురిలో మరో వ్యక్తి తన వెంట తెచ్చుకున్న తుపాకీ తీసి లోడ్ చేసి కాల్పులు జరుపగా, ఒక రౌండ్ మిస్ ఫైర్ అయి బుల్లెట్ అరుణ్ కు తగలలేదు.
తుపాకీని మరోసారి లోడ్ చేసేలోపే అరుణ్ అక్కడి నుంచి ప్రాణ భయంతో తప్పించుకుని అతని ఇంటి సమీపంలో ఉన్న మరో ఇంట్లోకి చొరబడి తలుపులు వేసుకొని తలదాచుకున్నాడు.
అరుణ్ తలదాచుకున్న ఇంటిని ముట్టడించి ఆ ఇంట్లో ఉన్న వారిపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. ఆగ్రహంతో ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు.అర్థరాత్రి స్థానిక ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని లేపి కేకలు వేస్తూ అరుణ్ ఆచూకి చెప్పాలని కత్తులు,తుపాకీతో బెదిరింపులకు పాల్పడటంతో కాలనీవాసులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
అరుణ్ ఆచూకీ లభించకపోవటంతో అతని భార్య, ఇద్దరు కూతుర్లపై దాడి చేశారు.కాలనీవాసులు అంతా ఏకమై ముగ్గురుని పట్టుకోగా వారిలో ఇద్దరు పరారయ్యారు.
పరారైన ఇద్దరిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు.పట్టుబడిన ఇద్దరిలో యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన మల్లేష్, మానకొండూర్ మండలం కెల్లేడు గ్రామానికి చెందిన మధు ఉన్నారు.
ముగ్గురిలో ఇద్దరు పట్టుబడగా,పరారైన వ్యక్తి వద్దనే తుపాకీ ఉన్నట్లు సమాచారం.అరుణ్ పై దాడి చేసేందుకు వచ్చిన ముగ్గురికి నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది.గాయపడ్డ అరుణ్ కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కరీంనగర్ రూరల్ ఎసిపి తాండ్ర కరుణాకర్ రావు,సిఐ మాదాసు రాజ్ కుమార్ అర్థరాత్రి సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటన వివరాలు తెలుసుకున్నారు.
సిఐ రాజ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి,స్థానికుల నుంచి వివరాలను సేకరించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.